పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణమోహన బెనర్జీ

ఈయన ప్రతిమయు మాకు దొరకలేదు, ఈయన బంగాళా దేశ బ్రాహ్మణుఁడు ఈయన తండ్రిపేరు జీవన్‌కృష్ణ బెనర్జీ ఈకృష్ణమోహను బెనర్జీ 1813 వ సంవత్సరమున మే నెలలో గలకత్తా నగరములో నుదయించెను. అయిదేండ్ల వయసువాఁడైనప్పుఁడతఁడు విద్యారంభముచేసి బంగాళీభాషలోఁ జదువుటయు వ్రాయుటయు లెక్కలు సేయుటయు నేర్చికొనెను. తరువాత గొంతకాలమున కాయన హిందూకళాశాలకుఁ బోయి యచ్చట నాంగ్లేయభాషను సంస్కృతమును నేర్చికొనియెను. 1828 వ సంవత్సరమున కృష్ణమోహనుని తండ్రి విశూచి జాడ్యమువలన లోకాంతరగఁడయ్యెను. పితృవియోగముచేత విద్యాభ్యాసము చక్కఁగా సాగనందున నతఁడు నెలకు పదియారు రూపాయిలు విలువఁగల విద్యార్థి వేతనమును సంపాదించి చదువనారంభించెను. మరుచటి సంవత్సరము వానికి ఢిల్లీ కళాశాలలో నొక యుపధ్యాయ కోద్యోగ మయ్యెను. కాని కొన్ని గృహసంబంధములగు నిబ్బందులచేత పోఁజాలక యతఁడా సంవత్సరము నవంబరులోనే హేరుదొరగారి పాఠశాలలో నుద్యోగము సంపాదించెను. ఆకాలమున బంగాళాదేశమున దృఢచిత్తులగు పడుచువాండ్రు కొంద ఱొక సంఘముగాఁ జేరి హిందూమతమును నిర్మూలింపవలయునని నిశ్చయించుకొని తద్విషయమయి పాలుమాలిక లేక పాటుపడఁ జొచ్చిరి. కృష్ణమోహనుఁడు గూడ నా సంఘమునఁ జేరి తద్విషయమున గట్టిప్[అనిఁ జేయుటకు నొక యింగ్లీషు వార్తాపత్రికను బ్రకటింపఁ జొచ్చెను.