పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

మహాపురుషుల జీవితములు

యాపత్రిక నడపుటఁకుఁ గావలసినంత యోపిక యతనికి లేకుండుటచే నాపని యతనికి కష్టమని తోఁచెను. ఇట్లు తేజోవంతమైన జీవయాత్ర మఱువదియేడు సంవత్సరములవఱకుఁ జేసి రాజేంద్రలాలుమైత్రా 1891 వ సంవత్సరమున పక్షవాత రోగముచేతఁ గాలధర్మ మొందెను.

మేధావంతుఁడై మిక్కిలి పూనికతో పాటుపడు మనుష్యుఁడెంత యభివృద్ధినొందునో రాజేంద్రలాలుని చరిత్రమువల్ల తెల్సికొనవచ్చును. ఆంగ్లేయభాషలో వ్రాయుటకు మాటలాడుటకు నతని కద్భుతశక్తిఁ గలదు. సర్‌రిచర్డు టెంపిలు దొరగారు "ఆకాలము మనుష్యులు కార్యములు" అను నర్థముగల యాంగ్లేయ గ్రంథమును వ్రాయుచు రాజేంద్రునిఁగూర్చి యిట్లు వ్రాసిరి. "ఆంగ్లేయభాషను ప్రాగ్దేశభాషలను నేర్చిన పండితులలో నితఁ డగ్రగణ్యుఁడని చెప్పవచ్చును. పూర్వ హిందువుల యద్భుత ప్రజ్ఞలం దలంచి యతఁడు మిక్కిలి యక్కజమును గరువమును బొందుచు నీనాఁటి హిందువుల దురవస్థను గూర్చి మిక్కిలి వగచు చుండువాఁడు." మోక్సుమూలరుపండితుఁడు తన గ్రంథములలో నొకదానియందు వీనింగూర్చి యిట్లువ్రాసెను, "రాజేంద్రలాలు మైత్రుఁడు వృత్తిచేత పండితుఁడే గాక గట్టి విమర్శకుఁడు. ఏషియాటిక్కు సంఘము వారి యొక్క మాసపత్రిక కనేకములగు విషయములను వ్రాసి యతఁడు హిందూదేశ ప్రాఁచీన విద్యలనుగూర్చి యీవరకు తప్పులగు నభిప్రాయములు గల తన దేశస్థులందఱికంటె నెక్కువవాఁడని తేట పరచెను.

అతఁడు వ్రాసిన గ్రంథము లన్నియు నేఁబది. అవి నూట యిరువదిసంపుటములుగ విభజింపఁ బడియున్నవి. అ గ్రంథములయందలి పుటలు ముప్పదిమూఁడు వేల కంటె నెక్కువఁ గలవు.