పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
102
మహాపురుషుల జీవితములు

విద్యార్థిగఁ దీసికొనిరి. కాని యప్పుడే యతనికి దారుణజ్వరము సంభవించుటచే నతఁడందు వెంటనే చేరలేకపోయెను. రాజేంద్రుడు పదునై దేండ్ల ప్రాయముగలవాఁ డయినప్పు డనఁగా 1839 వ సంవత్సరమున వైద్యకళాశాలలో పైన పేర్కొనబడిన పద్ధతిని విద్యార్థి యయ్యెను. కళాశాలలో నతఁడు చేసిన విద్యాభివృద్ధి మిక్కిలి ప్రశంశనీయమై యుండెను.

ఆతని బుద్ధికుశలత విని మహర్షి దేవేంద్రనాథ టాగూరుగారి తండ్రియగు ద్వరకానాథ టాగూరుగారు మైత్రా నింగ్లాండు దేశమునకుఁదీసికొనిపోయి యక్కడవిద్య పరిపూర్తి చేయింతుననిచెప్పెను. కాని తండ్రి మైత్రాను విదేశమునకు బంపడయ్యె. ఆ వైద్యకళాశాలలోనున్న కాలముననే రాజేంద్రుడు కేవలముతనయశ్రద్ధచేత దొరతనమువారి కైదువందల రూపాయిలు నష్టము గలిగించెను. ఒకనాడతడు కొన్నిలోహలను గరగించుచుండెను. అట్లు కరగించుటకు ప్లాటినం అను మిక్కిలి విలువగల లోహముతో చేయబడిన మూస యొకటి తెచ్చి దానిని నిప్పులమీఁదబెట్టి యా లోహమందువేసి కరగింప నారంభించెను. కొంతసేపటికి రాజేంద్రుడు తనప్రయత్న మెంతవఱకు నెర వేరినదో తెలిసికొందమని చూచునప్పటికి మూసయే కరగి పోయెను. అది చూచి బాలుఁడగు రాజేంద్రుడు భయమున గడగడ వడఁకుచు తనయొజ్జయగు ప్రకృతి శాస్త్రపండితున కాసంగతి విన్నవింప నతడు వానిని చీవట్లుపెట్టి కళాశాలకు నధికారియగు డేవిడ్ హైరుదొరగారి కాసంగతి దెలియజేసెను. ఆదొరగారును రాజేంద్రుని పిలిపించి వానిం దిట్టక కొట్టక కళాశాలలోనుండి తీసివేయక యట్టి పనులయెడల ముందు జాగరూకతతో మెలంగవలయునని చెప్పి మందలించి పంపెను.