పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

మహాపురుషుల జీవితములు

ముగఁజెప్పు ధైర్య మతనియొద్దనుండెను. అంతధైర్యముండుటచేతనే యొకమా రతఁడు బంగాళాదేశమం దంతట ప్రసిద్ధికెక్కిన మహా పండితుఁడు డాక్టరు డఫ్‌దొరగారి మాటలనేఖండించి పూర్వపక్షము చేసెను. ఆకాలమున బంగాళాదేశమందు జార్జి తాంసన్ అనుదొర గలఁడు. ఆయన రాజకీయ వ్యవహారములను గూర్చి దిట్టమయిన యుపన్యాసముల నియ్యఁదొడఁగెను. అతఁడు వాగ్నైపుణికిఁ ప్రసిద్ధి కెక్కెను. ఆదొరగారిని కృష్ణదాస్‌పాలుఁ డొకనాఁడు తన సమాజములో జరుగు నొకసభకు నధ్యక్షుఁనిగా నుండుమనిపిలిచెను. ఆదొరగారు విద్యావిషయములగు చర్చలను జేయునట్టి చిన్న సమాజములలోఁ దనవంటివాఁ డుపన్యసింపఁదగదనియు విశేషించి తన రాజకీయ వ్యవహారములను గూర్చియే కాని యితరవిషయములను గూర్చి యుపన్యసింపననియుఁ జెప్పి హిందూపేట్రియేటను వార్తాపత్రికనుదీసి చూపి యీ పత్రికాధిపతి యొక్కఁడే హిందువులలో రాజకీయ విషయములనుగూర్చి గ్రహింపఁగల సమర్థుఁడనియుఁ దక్కినవారికిఁ జెప్పినను దెలియవనియు గర్వోక్తిగాఁ బలికెను. ఆమాటలు విని కృష్ణదాసాదినము మొదలుకొని తానుగూడ హరిశ్చంద్ర ముకర్జీ యంతవాఁడు కావలయునని నిశ్చయించుకొనెను. అది మొద లతఁడు పేట్రియేటు పత్రికను తప్పక చదువుచు వచ్చెను. ఆతఁడు కడుబీదవాఁడగుటచే పత్రిక తెప్పించుకొనుటకు ధనము లేక సమాజకార్యదర్శి నడిగికొని చదువవలసివచ్చె. ఈపత్రికగాక యింగ్లీషుభాషలో ప్రకటింపఁబడు నితర పత్రికలనుగూడఁ జదువుచు వాని కప్పుడప్పుడు తనకుఁదోఁచిన సంగతులనువ్రాసి పంపుచు నితరగోష్టిని విడిచి యతఁడు విద్యాగోష్టియందె కాలము పుచ్చు చుండెను.

ఆతఁడు హిందూపేట్రియేటుపత్రికకుఁగూడ కొన్ని సంగతులు వ్రాసి పంపెను. తానువ్రాసిన వ్రాత యాపత్రికలో ప్రకటింపఁ బడి