పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
82
మహాపురుషుల జీవితములు

ద్వారకనాథ మితర్ చదువు ముగించి పాఠశాల విడిచినతోడనే దైవయోగమునఁ దండ్రి పరలోకగతుఁడగుటచే నేదేని యుద్యోగమును సంపాదించి కుటుంబపోషణముఁ జేయవలసివచ్చెను. దొరతనమువారి చేతికింద నేదేని యుద్యోగముఁజేయు టతని కెంతమాత్రమిష్టము లేనందున నెటులైన శాస్త్రపరీక్షయందుఁ గృతార్థుఁడై న్యాయవాదిగా నుండవలయునని యతఁడు సంకల్పించుకొనెను. కాని దారిద్ర్యముచేత దన మనోనిశ్చయమును మార్చుకొని కలకత్తాలో పోలీసు మేజస్ట్రీటుకచేరిలో నెలకు నూటయిరువది రూపాయలు జీతముగల యుద్యోగ మొకటి కాళీవచ్చినందున యతఁడు దానింగూర్చి ప్రయత్నించి యందుఁజేరె. చేరి యందు చిరకాల ముండక ద్వారకనాథుడు శాస్త్రపరీక్షకుఁ జదివి యందుఁ గృతార్థుఁ డై న్యాయవాది యయ్యెను. న్యాయవాదియై తనపనిలో మంచిపేరు సంపాదించుటకై చాల పరిశ్రమచేసెను. న్యాయవాదుల కెంత బుద్ధికుశలతయున్న నెంతప్రజ్ఞయున్న దమ సామర్థ్యముం జూపుటకుఁ దగిన సమయము రావలయునుగదా!

ద్వారకనాథుఁడు మొదటినుండియు నదృష్టవంతుఁ డగుటచే పని యారంభించిన యాఱుమాసములకే యొక పెద్ద వ్యాజ్యమున నొక గొప్ప న్యాయవాదికి సహాయుఁడుగా నేర్పరుపఁబడెను. అతని భాగ్యవశమున నావ్యాజ్యము విచారణకు వచ్చినప్పుడా పెద్దన్యాయవాది యూరలేకపోవుటచే ద్వారకనాథుని తెలివితేటలు గనబరచుటకు మంచియదను దొరకెను. తనవృత్తియందు మిక్కిలి యారితేరినవాఁడు గాకపోయినను ద్వారకనాథుఁడు న్యాయాధిపతుల (జడ్జీల) మనస్సులకు నచ్చునట్లు వ్యాజ్యమునందలి సంగతులెల్ల నరటిపండొలిచి చేతికిచ్చినట్లుచెప్పి బోధించి వాదించెను. దీనితో నతనికి మంచిపేరుగలుగఁ గీర్తిదేశమందు వ్యాపించెను. ఆతని సమకాలికుఁడె