పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాపురుషుల జీవితములు


రాజారామమోహనరాయలు

రామమోహనరాయలు బంగాళాదేశమందలి, హుగ్లీ మండలములో రాధానగరమున క్రీస్తుశకము 1774 వ సంవత్సరమున జననమొందెను. అతనితండ్రి రమాకాంతరాయలు. చిన్న జమీందా రయియుండి, కొంతకాలము మూర్ష దాబాదు నవాబులయొద్ద నుద్యోగముచేసి యాప్రభువులు రాజ్యభ్రష్ఠులైన పిదప బర్డవాను మహారాజునొద్ద కొలువుచేసెను. రామమోహనుతల్లి తారుణీ దేవి, సత్ప్రవర్తనకును, యోగ్యతకును బ్రసిద్ధికెక్కెను. ఆతని తలిదండ్రు లిరువురు దైవభక్తిగలవారును, మతవిషయమునఁ బట్టుదల గలవారునైరి. ఆదినములలో పారసీభాషయే రాజభాషగా నుండుటంజేసి, రామమోహనుఁడు బంగాళీభాషఁ గొంతనేర్చిన వెనుకఁదొమ్మిదివత్సరముల ప్రాయమున నరబ్భీ పారసీభాషలు నేర్చుకొనుటకయి పాట్నానగరమునకుఁ బంపఁబడెను. అచ్చట రెండు సంవత్సరములలోఁ గుశాగ్రబుద్ధి యగునాతఁ డాభాషలలో నుద్గ్రంథముల ననేకములు చదివి, సంస్కృతవిద్యాభ్యాసముఁ జేయుటకయి పండ్రెండవ యేటఁ గాశికానగరమునకుఁ జని యాభాషలోఁ గొలఁదికాలములోనే బండితుఁడయి యుపనిషత్తులం జదివి, తత్సారమును గ్రహించెను. రామమోహనుఁ డుపనిషదర్ధముఁ దఱచి గ్రహించి తనపదునారవ యేటనే బంగాళీభాషలో విగ్రహారాధనము నిషేధించుచు నొకగ్రంథము వ్రాసెను. ఇదియే బంగాళీభాషలో మొట్టమొదటి వచన కావ్యము. విగ్రహారాధనము హిందువులు ప్రమాణముగ గ్రహించు చున్న వేదశాస్త్రములచేత నిషేధింపబడినదనియు, మనపూర్వులగు