పుట:Mahaakavi dairiilu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[1]

శ్రీ అప్పారావుగారి నిర్యాణం

విజయనగర విద్యావేత్త

30 నవంబరు, విజయనగరం :

చాలా కాలంనుంచి వ్యాధిగ్రస్తులైవున్న శ్రీ గురజాడ వెంకట అప్పారావుగారు తమ ఏభైనాలుగవయేట నేటి ఉదయం తమ స్వగృహంలో పరమపదించారు. వీరు విజయనగర కళాశాలలో విద్యనభ్యసించి పట్టభద్రు లయారు. అదే కళాశాలలో పెక్కు సంవత్సరాలు ప్రొఫెసరుగా వుద్యోగం చేశారు. తరువాత ఆనంద గజపతి మహారాజావారి ఆంతరంగిక కార్యదర్శిగనూ, పిమ్మట డవేజరు మహారాణి, రీవా మహారాణుల ఆంతరంగిక కార్యదర్శిగనూ పనిచేశారు.

మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగుభాషకు పరీక్షాధికారులుగ శ్రీ అప్పారావుగారు కొంతకాలం నియమితులు. మూడేళ్ళక్రితం సెనేటుకు సభ్యులుగ వీరిని ప్రభుత్వం నియమించింది. వీరికి ఆంగ్లకవిత్వమంటే మిక్కుటమైన ఆసక్తి కలదు. శ్రీ అప్పారావుగారు రచించిన ఆంగ్లగీతాలు, ' రీస్ అండ్ రయత్ ' సంపాదకులు స్వర్గీయ డి. వి. శంభుచంద్ర ముఖర్జీగారి ప్రశంసల నందుకొన్నవి. శ్రీ అప్పారావుగారు తెలుగుభాషలో కన్యాశుల్కమనే నాటకమును రచించారు. తాము ఆంతరంగిక కార్యదర్శులుగవున్న సమయంలో సంస్థాన పరిపాలనను దక్షతతో నిర్వహించడానికై తమ పలుకుబడి నంతటినీ వినియోగించారు.

  1. ఇది మద్రాసు మెయిలు దినపత్రికలో ప్రకటితమైన వార్త.