పుట:Mahaakavi dairiilu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6

ఇవి ఆయన ఆత్మప్రచోదనార్థము, పరిశీలనార్థము వ్రాసుకున్నవి కనక యీ సంపుటి మహాకవి జీవితమునకు 'రేఖాపటము' వంటిది.

ఆయన జీవిత రేఖాపటము స్థూలముగా రెండు విభాగములు. అవి ప్రధమ, ద్వితీయ పాదములు. విద్యార్థిదశ అనంతరం 1887 నుంచి 1896 జూన్ నెల 5 వ తేదీవరకు యీ తొమ్మిదేళ్ళకాలమూ ఆయన జీవితంలో ప్రధమపాదం. తదనంతరం 1915 వరకూగల కాలం ద్వితీయపాదం. మహాకవిగా, గొప్ప నాటక రచయితగా, భాషావేత్తగా, విద్యావేత్తగా, విమర్శకునిగా ఆధునిక ఆంధ్రవాఙ్మయ యుగపురుషునిగా, తత్త్వవేత్తగా పరిణతి చెందే రెండవదశకు మొదటిదశ నాంది. గొప్ప సాహిత్యవేత్తకు కావలసినవన్నీ ఆయన కీపూర్వరంగమే ప్రసాదించింది. గ్రాంధిక భాషావాదులపై, సనాతన మతానుసారులపై తిరుగుబాటుజరిపి విస్ఫోరక సాహిత్యాన్ని సృష్టించే, సమాజ చైతన్యాన్ని మార్చివేసే మనోబలాన్ని, ధైర్యాన్నీ, సాహసాన్నీ, భాషా సారస్వతాలపై అధికారాన్నీ, వినూత్న దృష్టినీ ఆయన కిచ్చిన దశ యిదే! మున్ముందు మహాకవి కాబోతున్న ఆయన భవిష్యత్తునకు యిది వొక పూర్వరంగం.

ఈ ప్రధమ పాదములో అత్యంత ప్రధానమైనవి 1895 వ సంవత్సరపు డైరీలు. మహాకవి ఆత్మ తేజస్సు అనేక విషయాలలోనికి ప్రసరించింది. నాటకములు, సభలు, సమావేశములు, సాహిత్యము, కళలు, తర్కవితర్కములు, ఉపన్యాసములు, సూక్ష్మాతిసూక్ష్మ శీలపరిశీలనలు, విద్వద్గోష్ఠులు, కళాశాలలు, విద్యావిధానము, శాసనములు, చిత్తరువులు, గాన కచేరీలు,