పుట:Mahaakavi dairiilu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5

వహించిన తాత్త్విక దృక్పథము, కావించిన ప్రజాసేవా, వీటిని బట్టి యిది కలుగుతూ వుంటుంది.

ఇటు సమాజంలోనూ, అటు సాహిత్యంలోనూ సదా పురోభివృద్ధినే కోరుతూ, దానికోసం ఎడతెరిపిలేని పోరాటాలను సాగించిన యుగపురుషుడు మహాకవి గురజాడ. కాలాన్ని వెనక్కి తిప్పే ప్రతి మూఢ సిద్ధాంతాన్నీ, అంధ విశ్వాసాన్నీ ప్రతిఘటించి, "నాది ప్రజల వుద్యమము; దానిని యెవరిని సంతోషపెట్టడానికైనా వదులుకోలేన" నే మాగ్నా కార్టా ప్రకటనతో ప్రగతి శక్తులకూ, వొక కొత్తతరానికీ, యుగానికీ, గీతానికీ, సంగీతానికీ, సింహద్వారం తెరిచిన నిండు వ్యక్తి గురజాడ. అట్టి ఆంధ్ర జాతీయ మహాకవి డైరీలు యివి.

రచనలలో కవి, 'కవితామూర్తి'ని సందర్శించినంత ప్రస్ఫుటముగా, అతని వ్యక్తిజీవితాన్ని మనం వాటిలో దర్శించలేము. మహాకవుల, కృతి వొక గొప్ప భవంతిలో డ్రాయింగు రూమువంటిది. అందులో వంటిల్లు వంటిది డైరీ. డైరీలు సామాన్యమైన పారకునికి సైతం, మహాకవులతో ఎంతో చనువును కల్పిస్తవి. కనకనే డైరీలలో కవుల వ్యక్తిత్వము తేటగా కనబడినట్లు, వారి యితర రచనలలో గోచరించదు.

'కన్యాశుల్కము'లో 'ముత్యాలసరముల'లో 'ఆణిముత్యాల' కథలలో మహాకవి గురుజాడతో మనకు ఏర్పడిన ఆత్మ బాంధవ్యమూ, చనువూ, 'మహాకవి డైరీలు' చదివిన వెంటనే వొకింతకు పదింతలవుతాయి.