పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిసియస్సు

71


అథీనియనులకు కోప ముద్రేకించెను. నిసియస్సు, ఆల్సిబియాడీసు, మఱియొకనిని వీరి మువ్వురిలో నొకనిని దేశోచ్చాటన చేయుటకు వారు యత్నించిరి. అంతలో వీరిరువురు కలిసి స్నేహము చేసికొని మూఁడవవానిని దేశోచ్చాటనఁ జేయించిరి. వీరుభయులు సంధిఁ జేసికొనుటఁ జూచి ప్రజలు మిగుల సంతసించిరి.

పరదేశీయుల ప్రోత్సాహముచేత అధీనియనులు సిసిలీ ద్వీపముపైకి దండెత్తపోవఁ దలఁచిరి. కూడదని నిసియస్సు, సోక్రెటీసు మొదలగువారు: కూడునని ఆల్సిబియాడీసు మొదలగు పడుచువారు; సపక్ష పరపక్షముగ సభలో వాదించిరి. సభవారు దండెత్తి వెళ్లుటకు యత్నించి 'నిసియస్సును' 'ఆల్సిబియాడీసు'ను సేనానాయకులుగ నియమించి దళము లాయత్త పఱచిరి. వా రా ద్వీపమునకు తర్లి వెళ్లిరి. అక్కడనుండి ఆల్సిబియాడీసు విమర్శనకు మరలినందున సేనాధిపత్యము నిసియస్సు కిచ్చిరి. అతఁడు యుధ్ధము సాంతముచేసి దుర్గములను బట్టుకొని ద్వీపములో ముఖ్యపట్టణమైన 'సిరాక్యూసు'ను ముట్టడించి దాని లొంగదీసెను. ఆ పట్టణము లోఁబడిన పిదప దాని చుట్టు పరిఘల నెత్తించి దుర్గముల కట్టి యగడ్త నతఁడు త్రవ్వించుచుండెను. మూత్రకృచ్ఛరోగముతో నతఁడు బాధ పడుచుండియు స్వల్పకాలములో నిన్ని కార్యములు చేసినందు కతనిని స్వదేశీయులు శ్లాఘించిరి.