పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


ష్టముచేత కలిగెనని యతఁడు చెప్పుచుండెను. ఆకాలములో 'ఆథీనియనులు' విశేషముగ బాధలు పడుచున్నను వానిని పరుల దోషములవలన సంభవించె నని వారు పలుకుచుండిరి గాని 'నిసియస్సు'వలన సంప్రాప్తమయ్యె నని వారు చెప్పుట లేదు.

ఈకాలములో నాథెన్సు పట్టణములో నొకవక్త బయలుదేరెను. అతని పేరు 'ఆల్సిబియాడీసు'. ఇతరులవలె నతఁడు దుర్మార్గుఁడు కాకపోయినను నతని గుణములు విపరీతముగ నుండెను. దుర్మార్గులను వెడలఁగొట్టి పట్టణమునకు స్వాస్థ్యమును నిసియస్సు తెచ్చుసరికి 'ఆల్సిబియాడీసు'వలన నది తగ్గిపోయి మరల దౌర్జన్యములు బయలు దేరెను.

ఈలోపున స్పార్టనులకు 'అథీనియను'లకు యుద్ధము పొసగినను నిసియసు రెండుకక్షలవారికి సంధిచేయుటకు యత్నించెను. పెద్దలంద ఱందుకు సంతసించిరి. ఒక సంవత్సరము వఱకు వారు యుద్ధము మానిరి. కుక్కుట ధ్వని విని వా రుదయమున లేచుచుండిరి. రణభేరీ మ్రోగుట లేదు. అట్టి సమయమున స్పార్టనుల రాయబారులుగూడ వచ్చిరి. సంధిమాటలు సభామండపమున జరుగుచుండెను. ఆల్సిబియాడీసుయొక్క. ప్రేరణచేత సంధిమాటలు పొసఁగలేదు. పడుచువారు యుద్ధమునకు వృద్ధులు సంధికి యిట్లు నిరుతెగలుగ అథీనియనులు విడిరి. మాటలు పొసఁగనందున రాయబారులు లేచిపోయిరి.