పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


ముగఁ గాలముఁ గడుపుచు, మహనీయుల జీవితచరిత్రములను వ్రాయ నారంభించెను.

ఈ చరితములను చరిత్రములు వ్రాయువిధమున వ్రాయకపోయినను, నతఁడు వానిని రసవంతములుగ జేసెను. దేశకాల సంబంధముల నతిక్రమించి చరిత్రాంశములను వ్రాసినను, జ్ఞానోపదేశములచేత వాని నతఁడు నింపినందున, పండిత పామరులు వానిని శ్లాఘించుచున్నారు. కంటకములతోఁగూడిన గులాబీ పుష్ప మెంత మనోహరముగ నుండునో, యటుల సంకటములతోఁ గూడియున్న యతనిగ్రంథ మంత యాహ్లాదకరముగ నున్నది.

సృష్టిస్థితిలయకర్తయైన పరమేశ్వరుఁ డొక్కఁడైనను, మీఁది మెట్టుననున్న దేవతలకు క్రింది మెట్టుననున్న మనుజులకు, యెవరికి సమీపముననున్న వారి గుణరూపములను బొందుచున్న ప్రాణులు కలవని యతని నమ్మకము. శూన్యస్థల ముండుట ప్రకృతికి విరుద్ధము గనుక, దేవతలకు మనుజులకుఁ గల యంతర మీ జీవులచేత నిండియుండక తప్పదని యతఁడూహించెను. పుణ్య పాప కర్మములకుఁ దగినటుల నీ ప్రాణులను లోమ విలోమముగ దేవ మనుజ రూపములను బొందుచుందురని యతని యభిప్రాయము.

స్వగ్రామమున గ్రంథావలోకనలోనేగాక, వైదికవ్యాపారములను లౌకిక చర్యలతో గలిపి కాలమతఁడు గడిపెను.