పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


రీతిని సోదెసంగతి నతనితోఁ జెప్పెను. అతఁ డేమి యాలోచించెనో తెలియదు గాని, తన కుమారితె నితనియొద్దకుఁ బంపెను. అప్పుడు 'ఆజియను' ఆమెను జూచి మోహించెను. ఆమె గర్భసంస్కారములు పొందెను. అతఁ డా వృత్తాంతము గ్రహించి, యొక కత్తిని రెండు పాదరక్షల నొక బిలమున పదిలముఁజేసి, దానిమీఁద నొక బండరాతిని బోర్లించి, యా సంగతి భార్యతోఁ జెప్పి, కుమారుఁడు, కలిగిన యుక్తవయస్సున వాడు వానిని ధరించి తనయొద్దకు వచ్చునటుల జేయవలసిన దని యుత్తరువుఁ జేసి, నగరమునకుఁ బోయెను.

నానాఁ డామెకు నెలలు నిండి, యొక రోజున నామె సుఖ ప్రసవమయ్యెను; సుపుత్రుఁడు గలిగెను. శిశువునకు మాతా మహుఁడు 'థీసియసు' యని నామకరణముఁ జేసెను. పురిటిపిల్లఁడు పొత్తిళ్లపిల్లఁడై , మాసము లయనములు సంవత్సరములు నిండి యౌవనసంప్రాప్తుఁడయ్యెను. మాతామహుని జూచి యతఁడు తండ్రియని భావించుచుండెను. స్నేహితు లతనిని కానీనుఁడని పిలుచుటకు దుఃఖించి, తల్లియొద్దకు వచ్చి, తన తండ్రి యెవరో చెప్పవలసిన దని యతఁ డామెను గోరెను.

అప్పటికే, యతఁ డాజానుబాహుండు. సామువిద్యలు నేర్చుకొనినందున, నతని శరీరము కర్కశమయ్యెను. మదించిన వృషభమువలె నతఁడు నడుచుచుండెను. దేహలా