పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూమా

155


నలుబది సంవత్సరముల ప్రాయమువాఁ డయ్యెను. అంతలో రోమ్యులసు చనిపోవుట, సెనేటుసభవారు రాజ్యమేలుటయు జరిగెను, రోమకులంద ఱతనిని రాజుగ యేర్పఱచుకొనుటకు నిశ్చయించి, యతనిని ప్రార్థించి నగరమునకు రప్పించుట కిరువురు రాయబారుల నతనివద్దకు బంపిరి. సింహాసన మెక్కవలసిన దని కోరినపు డెవఁ డొల్లఁడని వారు తలంచి, యతనితో నొక్కి చెప్పలేదు. "విజనస్థలంబున విముక్త కాముఁడనై , కాలము గడుపుచున్న నాకు రాజ్యమేల? దేవాంశసంభూతుఁడైన రోమ్యులసువంటి మహాత్ములు మిమ్ములను బరిపాలించ వలెను. నేను మనుష్యమాత్రుఁడను. నాలో మహత్తులేదు. చతురోపాయము లెఱుంగను. చతురంగ బలముల నడిపించు పోణిమి లేదు; త్రిశక్తులు లేవు: అంగపంచక మెట్టిదో వినలేదు; చతుర్విధ సీమలలోనివారల నెటుల సంరక్షించవలయునో నేర్చియుండలేదు. ఈ నావంటివానితో మీకేమి ప్రయోజనము? 'కామంబులేని నన్ను మీరు వంచింపనేల' యని యతఁడు పితృ, బంధు, మిత్ర, సోదరవర్గంబుల సమక్షమున బలికి వారిని పొమ్మనియెను. ఈ మాటలువిని వారు నగరమునకుఁ బోయిరి. ప్రజలు చేయుట కేమియుఁదోఁచక, తిరుగ నతనియొద్దకు మఱియొక రాయబారమును బంపి వారు వెనుక నుంచి వచ్చుటకు సిద్దముగనుండిరి.

ఇంతలోఁ దండ్రి కుమారుని జేరదీసి "నాయనా, నీవు