పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సోలను

147


వేసెను. పురాతనముగ వచ్చుచున్నవానిలో మంచివాని నన్నియు నతఁడు నిలవఁ బెట్టెను; కొన్ని యశేషముగ మార్చి వేసెను; మిగిలిన వానిని సవరణఁజేసెను.

ఋణములను గొట్టివేసినందుకు సామంతు లతనిని దూషించిరి; భూములను సమముగ పంచనందుకు బీదవారు నిందించిరి. లైకర్గసు చేసినప్రకార మతఁడు చేయనందున కతనిని ప్రజలు గర్హించిరి. లైకర్గసు ధనవంతుఁడు; పలుకుబడికలవాఁడు; సమర్థుఁడు; అతఁడు చెప్పిన ప్రకారము చేయుటకు ప్రజలు సమ్మతించిరి. సోలను సంసారి; విశేషము పలుకుబడి లేనివాఁడు; అందుచేత నతఁడు వానివలె నేపనిచేయుటకు వీలులేకపోయెను. అందులో దేశకాలములను జూడవలెను. స్పార్టనులకు సరిపడిన రాజ్యాంగములు, అథీనియనులకు సరిపడు నని యెటులఁ జెప్పవచ్చును? కాఁబట్టి వారి శక్తికిఁ దన శక్తికిఁ దగినటుల రాజ్యంగముల నతఁడు సవరణఁ జేసెను; 'ఆర్యులసభ' నొకటి స్థాపించెను. -

అతఁడు వివాహములవిషయమై కొన్ని పద్ధతుల నేర్పఱచెను. స్త్రీలకు సారెచీర లిచ్చుటలేదు. “ధనము గలిగి యున్నదనియా, లేక గుణవంతురాలనియా, యామెను పురుషుఁడు వివాహమాడు.”నని యతఁడు చెప్పుచుండెను. ఎన్నడు నెవరును మృతినొందినవారిని దూషించకూడ దను నిబంధన కలదు. వారిని నిందించిన, వా రేమి వినవచ్చిరా?