పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గేయసు-గ్రాకసు

అన్నగారు చనిపోయిన పిదప, గేయసు రాజకీయ వ్యవహారములలోఁ దిగుట కిష్టము లేక యుండెను. కొంతకాల మతఁడు గృహములో నుండిపోయెను. ఎంతకాలము సోమరిగ నుండగలఁడు? అందుచేత వక్తృత్వము నభ్యసించి, దాని మూలమునఁ బ్రజల దృష్టిలోనికి రావలెనని యతఁ డెంచెను. ఒక సమయమున నతఁడు సభలో వాదించినపు డతని వాచాలత్వమునకుఁ బ్రజలు సంతసించిరి. సామంతుల గుండెలు ఝల్లుమనెను. అతఁడు ప్రజానాయకుఁడు గాకుండునటుల వారు పన్నాగములు పన్నుచుండిరి.

అతఁడు 'సిసిలీ'ద్వీపమునకు, 'ఆఫ్రికా'దేశమునకు యుద్ధముఁ జేయుటకు బంపబడెను. అతఁడు వీరుఁడు కాఁడని శత్రువు లనుకొనిరిగాని, వారి యూహ లబద్ధమయ్యెను. ఘోరముగ పోట్లాడి, శత్రువుల నతఁడు దునుమాడెను. రోమకసైనికులు దినుటకుఁ దిండి, కట్టుటకు బట్ట లేక బాధపడుచుండిరి. సెనేటుసభవారికి వ్రాసినను, వారు వానిని బంపలేదు.

139