పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“టైబీరియసు-గ్రాకసు'

‘గేయసు-గ్రాకసు'

వీరిరువురు 'టైబీరియసు-గ్రాకసు'యొక్క కుమారులు, ఇతఁడు రోమునగరములోఁ బెద్ద యుద్యోగములు చేసి, ధర్మాత్ముఁడని పేరుఁబొందెను. ఇతని భార్య 'కార్నీలియ'. ఒకనాఁ డతఁడు పండుకొనియుండ, రెండు సర్పములు వచ్చి యతని ప్రక్కనఁ బడుకొనెను. వాని నతఁడు పట్టుకొని చంపఁ బోయెను గాని, సోదెకాండ్రు గూడదని వారించిరి. పురుష సర్పమును జంపిన, యతఁడు చచ్చునని; స్త్రీసర్పమును జంపిన, యతనిభార్య మరణము నొందు నని వారు చెప్పిరి. అతఁడు పురుషసర్పమును జంపించి, రెండవదానిని విడిచిపెట్టించెను. మరి కొద్దికాలమున కతఁడు స్వర్గస్థుఁ డయ్యెను. సంసారమును భార్య నిర్వహింపవలసివచ్చెను. ఆమెకుఁ బండ్రెండుగురు సంతానము.

భర్త మరణానంతరమున నామె సంసారమును జూగరూకతతో నిర్వహించుచుండెను. ఆమెనువివాహముఁ జేసికొనుటకు 'ఈజిప్టు'దేశపురాజు కోర్కిడి, వర్తమాన మామెకుఁ బంపెను.

134