పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


రములవఱకుండి, తదనంతరము రాష్ట్రమువారు స్థాపించిన గరిడీశాలలోఁ బ్రవేశించును. అందులో వాఁడు తన యీడు బాలురతోఁ గలిసి సామువిద్యలను నేర్చుకొనును; ఎండ నీఁడ యనక, ఆఁకలి దాహమనక, అన్ని కాలములలో నేకవస్త్రధారి యై, గష్టపడును; ప్రాణములు నిఁలబడుటకుఁదగిన యాహారము మాత్రమే వాఁడు పుచ్చుకొనును. వాఁడెంత కష్టము భరించగలఁడో నిదర్శనముగఁ జూచుట కుపాధ్యాయులు వానిని బెత్తముతోరక్తమువచ్చువఱకు గొట్టుటకలదు. వ్రాయను, చదువనుమాత్రము వాఁడు నేర్చుకొనును. పెద్దచదువులు వారిలో లేవు. మాటలలో వారు మితభాషులు, ముప్పదిసంవత్సరములు వచ్చువఱకు వారిలో నెవఁడు పెద్దవాఁడు కాఁడు. అప్పుడు వాఁడు వివాహముఁ జేసికొనుట కాజ్ఞఁబొంది వివాహమాడినను, భార్యతోఁ గాపురము జేయుటకు వాని కాజ్ఞ లేదు; వాఁడు గరిడీశాలలోనే యుండవలెను; సామువిద్యలను జేయు చుండును; సహపంక్తిని భుజించవలెను. ఇటు లఱువదిసంవత్సరములు వచ్చువఱకు వాఁడు రాష్ట్రమునకై రక్తమును ధారవోసి, తదనంతరము గృహస్థాశ్రమధర్మములను జరుపుచుండును. దీనినే 'స్పార్టనుశిక్ష' యని లోకులు వాడుదురు,

ఇఁకను స్త్రీలవిషయమై చెప్పవలెను. వారుకూడ రాష్ట్రములోనివారుగనుక, గృహకృత్యములను జేయుటయేగాక, రాష్ట్రమును నిలఁబెట్టుటకుఁ దగిన బలముగల సంతానము