పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


ముతో నామె 'ఆంతొని'ని జూడవచ్చెను. ఆమెకు జిక్కి, యతఁడు వ్యవహారములను విడిచిపెట్టెను. "అహో మోహస్య దుశ్చేష్టితం”. విందులు, నాట్యములు, నాటకములు--వీనిలో వారు మునిఁగి తేలుచుండిరి.

అతని భార్య 'ఫుల్వియా' రోమునగరములో నుండెను. దుర్వ్యాపారములు గలవాఁడని, అతనిపక్షము వా రతనిని నిరసించి విడిచిపెట్టెద రను భయముకలిగి, యామె కొన్ని కుట్రలు పన్నెను. వీనివలన స్వపక్షము దృఢమగు నని యామె యెంచెనుగాని కలహములు లావై, 'అగస్టసు', 'ఆంతొనీ' లకు వైరముపుట్టెను. ఈ సంగతులు విని, 'ఆంతొని' రోము నగరమునకు వచ్చెను. ఇంతలో నతని భార్య మృతి నొందెను. అతఁడు 'అగస్టసు'తో సఖ్యముఁ జేసికొనెను. తూర్పుదేశములకు 'ఆంతొని', పశ్చిమదేశములకు 'అగస్టసు' - ప్రభువులైరి. 'ఆఫ్రికా'దేశమును 'లెపిడసు'నకు వారిచ్చిరి. భార్య చనిపోయినందున, 'అగస్టసు' యొక్క సవతియక్క, 'ఆక్టేవియా'ను 'ఆంతొని' వివాహమాడెను. ఈ సంబంధము వారి మైత్రిని బలపరచెను.

'ఘనుఁడు పాంపేయు'ని కుమారుఁడు 'సిసిలీ' ద్వీపములోఁ బ్రభువుగ నుండెను. ఇతనితో మైత్రిజేసి, 'ఆంతొని' 'గ్రీసు'దేశమునకుఁ బోయెను. అక్కడ గరిడీయుత్సవములు చేయించుటలో నతఁడు కొంతకాలము గడిపెను. 'పార్థివు'లు