పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


యనువానితో సహా దేశమును బంచుకొనెను. బ్రూటసు 'ఆథెన్సు' నగరములో నివసించుచుండెను. లోలోపున నతఁడు 'కాసియసు' మొదలగు స్నేహితులద్వారా పనిచేయించి, సైన్యమును జేర్చెను. రోముకు దూర్పుననున్న దేశము లతనికి స్వాధీనమయ్యెను. అతఁడు సైన్యములను దీసికొని 'అగస్టసు' పైకి వెడలెను. ఒకనాఁడు వీరు విడిదిచేసిరి. అతఁడు విశేషముగ నిద్రపోవువాఁడుగాఁడు. రాత్రి భోజనముఁ జేసి, 2 3 గంటల కాలము శయనించి, శేషించినకాలములోఁ జదువును; కొంతవర కుత్తరువులను వ్రాయును. స్కంధావార మా రాత్రి, నిశ్శబ్దముగ నుండెను. శిబిరములో నతఁ డొంటరిగ గూర్చుని వ్రాసికొనుచుండెను. అప్పుడు నిశిరాత్రి; ఒక చాయాగ్రహ మతనియెదుట నిలిచెను. “నీ వెవ్వఁడవు? నాతో నీకేమిపని?" యని యతఁడడిగెను. "నేను నీ దురదృష్ట దేవతను. యుద్ధములో నన్ను చూడగల"వని చెప్పి యా గ్రహము జారిపోయెను. అనంతరము పోరయ్యె, ఉభయసైన్యములు దార్కొని మిన్నుముట్టనార్చుచు, బొడుచుచు, దిక్కులు తెలియక, వెనుదియ్యక, పోరాడిరి. అగస్టసు జయముఁ బొందెను. కాసియసు మొదలగువారు మడిసిరి. బ్రూటసు మువ్వురు పరిచారకులతోఁ గూడి పరారియయ్యెను. వీరొక కొండ గుహనుజేరిరి. స్నేహితులకు గలిగిన విపత్తునకు విచారించి, తనను జంపి వేయవలసిన దని యతఁడు సేవకులకు