పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


నౌకాసేనానిగ నియమించిరి. వెంటనే అతఁడు నావలతో బయలుదేరి వారిమట్టు మాపెను. ఈ శుభవార్త రోమనులు విని మిగుల సంతసించిరి. రోమురాజ్యమునకు తూర్పుననున్న దేశముల కతనిని సర్వాధికారిగ వారు నియమించిరి. ఆ దేశములలో నతఁడు రోమకాధిపత్యమును స్థాపించుటకు మాతంగతురంగనరనికురంబబలంబులతో గదలివెడలి వాని నతఁడు స్వాధీనముఁ జేసికొని రాజధానిం జేరెను.

అతని ప్రతాప మిటుల లోకవిశ్రుతమైయుండ స్వగృహచరితము లింపుగ లేవు. అన్ని దేశములు తిరిగి వేళకు భోజన భాజనములు లేక, కీర్తిని సంపాదించుటకుఁ గష్టపడి యతఁడు సుఖముగఁ గాలయాపనఁ జేయవలె నని యిల్లు చేరెను. ఆతఁడు పరదేశములో నున్న కాలమున నతని భార్య పరపురుషునితోఁ గూడె నని యతఁడు విని కలఁతఁ జెందెను. ప్రపంచకధర్మ మంతయు ద్వంద్వమె. మనుజుఁడు ద్వంద్వా తీతఁడు కావలెను. అతఁడు దుఃఖపడి భార్యకు విడియాకు లిచ్చెను,

ఆతఁడు దేశములోనికి వచ్చి ప్రజల నెటుల త్రిప్పునో, రాజధానిలోఁ బ్రవేశించి నగరవాసుల నెటుల మన్నించునో, ప్రజారాజ్యముయొక్క నామరూపముల నేకరాజ్యాధిపత్యమునకు ఎటుల మార్చునో యని పలువిధములఁ బ్రజలు చింతంచిరి. క్రాసస్సు తన సర్వస్వము తీసికొని పట్టణము విడిచిపోయెను.