పుట:Madhavanidanamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములంజేసి శారీరమానసిక వ్యాధులు జనించును. అట్టిరోగములు జనింపకుండుటకును, జనించినవాని విస్తరింపజేయుటకును తగినయుపాయం బొకటి యావశ్యకము. జరావ్యాధులచే బాధింపబడు మానవకోటి నీక్షించి, కరుణారసార్ద్రహృదయములగు త్రికాలనేత్తలైన యాత్రేయడు, చరకుడు, సుశ్రుతుడు మున్నగు ముని పుంగవులు వారివారిపేర నాయుర్వేదసంహితల పలుదెరంగుల రచియించిరి. అయ్యని హేతు - లక్షణ-ఔషధంబులను మూడు స్కంధ(విభాగ)ములచే నిండియున్నవి. రోగములకు దగిన చికిత్స నరయుటకు వానికారణములను, రోగ లక్షణములను దెలుపుభాగమును హేతు లక్షణస్కంధముల నుడివిరి. ఈయభిప్రాయమునే "రోగమాదౌ పరీక్షేత కత్రోనర్తర మాషమ్" అని ప్రాచీనులు నుడివిరి. చికిత్సాభాగమును ఔషధస్కంధమున సప్రపంచముగ నిరూపించిరి.

పైజెప్పబడిన హేతులక్షణ స్కంధమునకే 'నిదాన ' మనియు నామాంతరము కలదు. అయ్యవి వారివారిసంహితలయందున్నను వానినన్నింటి నొక్కెర సంగ్రహించి చెప్ప పనిబూని మాధవకరుడు దనునాయుర్వేదవిదగ్రేసరుండు 'మాధవనిదాన ' మను గ్రంధమును రచియించె.

అందు "శ్రేయాంసి బహువిఘ్నాని ' అనునార్యోక్తిప్రకారము విఘ్నబాహుళ్యము నాలోచించి "మజ్ఞ్గగళాదీని మజ్ఞ్గళమధ్యాని మజ్ఞ్గళా నంతాని చ శాస్త్రాణి ప్రధస్తే, నీరపురషకాణ్యాయష్మత్పురుషకాణి చ భవంతి; ధ్యేతారశ్చ వృద్ధియుక్తా యధాన్యు:" అను భాష్యకారానుశాసనమును దలంచి తాజేయ బూనినగ్రంధమునం దిష్టదేవతా ప్రణామరూపంబగు మంగళమును "వ్రణమ్య....శివమ్" అను శ్లోకముచే రచియించెను:-

సకలజగంబులను సృజియించుటకును, కాపాడుటకును, సంహరించుటకును కారణమై, యాగారికర్మలచే బొందదగిన స్వర్గలోకసౌఖ్యమునకును, జ్ఞానముచే బొందగల పరమపురుషార్ధ మగు మోక్షమునకును దాతయై, స్వర్గ మర్త్యపాతాళంబు లను మూడు లోకంబులకు రక్షకుడై సర్వోత్కృష్టమైన సుఖము గల్గించు నప్పరమేశునకు సమస్కరించి గ్రంధముని రచించెద.

ఇచ్చట "ప్రణమ్య" అనుచోట అధిక్యార్ధమును దెలుపు ప్రశబ్ధముతో గూడిన నమధాతువును ప్రయోగించుటచే గ్రంధకర్తకుంగల భక్త్యతిశయము చూచింపబడుచున్నది. పరమశివనాచకమై మంగళార్ధకమైన శివశబ్ధమును బ్రయోగించుటంజేసి గ్రంధప్రవర్తకులకు, శిష్యులకు ను విఘ్నములేకుండునట్లు నిరంతర మంగళము ఆశాసింపబడినది.