పుట:Loochupu-fr.Jojayya.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిదురపట్టదు. కాని ఈలా తెచ్చి పెట్టుకున్న పనివల్ల జీవిత సమస్యలు 36: oo so-Living to work instead of working to live.

ఈ వ్యాసంలో సమస్యలను తప్పించుకొనే విధానాలను ఆరింటిని వివరించాం. అవి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడంతోనే దినమంతా గడిపివేయడం, వ్యాధిని సాకుగా వాడుకోవడం, పగటికలలు కంటూండడం, చిన్నపిల్లలూ నటించడం, అలుగుడూ అసమ్మతీ చూపుతూండడం, తెచ్చిపెట్టుకొన్నపని. ఈ నటనలన్నీ పెద్దవాళ్లలో కూడ వుంటాయి. కాని చిన్నపిల్లల్లో విద్యార్థుల్లో ఈ వేషాలు యింకా ఎక్కువగా కన్పిస్తాయి. వీటి వల్ల మన వ్యక్తిత్వం వృద్ధిలోకి రాదుగదా, కుంటుపడిపోతుంది. జీవితంలోని సమస్యలను ఉన్నవాటిని ఉన్నట్లుగా ఎదుర్కొని చిత్తశుద్ధితో పరిష్కరించు కొంటేనే గాని నిజమయిన స్త్రీ పురుషులంగా తయారుకాలేం. ఇక్కడ ఓ విషయం గుర్తించాలి. ఒకోమారు అపజయం తథ్యమని తెలుస్తుంది. అలాంటప్పుడు సమస్యలనుండి వైదొలగడమే ఉచితం. ఉదాహరణకు మనం ఓ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నాం. మనకంటె గట్టివాళ్లు ఇంకొకరు అదే ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మనం ఆ ప్రయత్నం నుండి విరమించుకోవడమే మేలు. ఈలాగే ఒకోమారు తాత్కాలికంగా సమస్యనుండి విరమించుకొంటూంటాం గూడ. ఉదాహరణకు : ఓ విద్యార్థి సరిగా చదువలేదు గనుక ఇప్పుడు పరీక్షలకు కట్టలేడు. బాగా చదువుకొని ఈమారు వచ్చే పరీక్షలకు కడతాడు. ఈ రెండు ఉదాహరణల్లో సమస్య నుండి విరమించుకోడానికి తగిన కారణాలున్నాయి. కాని చాలమంది కేవలం సోమరితనంవల్లనో, పిరికితనంవల్లనో బద్దకింపువల్లనో తగిన కారణం లేకుండానే సమస్య నుండి తప్పకొంటూంటారు. ఈలాంటి వాళ్లకు చక్కని వ్యక్తిత్వం అలవడదు. ఈ సత్యాన్ని గుర్తించి యువతీ యువకులు జీవితంలోని చిక్కులను తప్పకోవడానికి గాదు, ఎదుర్కోవడానికి సంసిద్దు లౌతుండాలి.