పుట:Loochupu-fr.Jojayya.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. రాజు ప్రకాశమూ హాస్టలు విద్యార్ధులు. ఓ మారు తోడి విద్యార్థి రాజును పుస్తకమీయమని అడిగాడు. అతడు లేదుపో అన్నాడు. తర్వాత రాజు ఆ విద్యార్థిని కసురుకొన్నానేమోనని అనవసరంగా అంతరాత్మను బాధ పెట్టుకొన్నాడు. ప్రకాశం కొన్ని చెడ్డపనులు చేసినమాట నిజమే. కాని అతడు భగవంతుడు తన తప్పిదాలను క్షమిస్తాడో లేదో అని శంకించి బాధ పడుతూంటాడు.

ఈ యిద్దరి చిత్తవృత్తులవల్ల తెలిసికోవలసిన దేమిటి? రాజు అనవసరంగా అంతరాత్మను బాధపెట్టుకుంటాడు. ప్రకాశం పాపశంకతో బాధపడిపోతాడు. చాలమందికి అంతరాత్మ మొద్దువారి వుంటుంది. వాళ్లు పాడుపనులు చేసికూడ యేమీ బాధపడరు. కొద్దిమందిలో అంతరాత్మ మరీ సున్నితంగా పనిచేస్తూంటుంది. అలాంటివాళ్లు పెద్దదానికి చిన్నదానికి గూడ బాధపడిపోతుంటారు. మొద్దువారిన మనస్సాక్షి మంచిది కాదు. కాని సున్నితమైన అంతరాత్మ కూడ అంత మంచిది కాదు. మనం ఇతరులకు హాని చేయకపోయినా చేసానేమోనని బాధపడ్డం, దేవుడు మన దుష్టకార్యాలను క్షమిస్తాడో లేదో అని సంకోచించడమూ ఇవి రెండూ అసహజ ప్రవర్తనలు. కనుక వ్యక్తిత్వాన్ని అభిలషించేవాడు ఈ యనిష్ట గుణాలను తప్పక సవరించుకోవాలి. False conscience and False guilt.

ఈ వ్యాసంలో వ్యక్తిత్వాభివృద్ధిని అరికట్టే అవరోధాలను ఐదింటిని పేర్కొన్నాం. అవి జంకూ కుమిలిపోవడం, భయమూ విచారం, తగని ಪಟು తప్పకోవటం, అపజయమూ నిరుత్సాహం, అనవసరంగా అంతరాత్మను బాధపెట్టుకోవడం పాపశంక. ఈ యైదుగుణాలూ భయం వల్ల పుట్టినవే. జీవితంలో భయం రకరకాల రూపాల్లో ప్రత్యక్షమౌ తూంటుంది. ఇక్కడ మనం చూచిన భయరూపాలు కొన్ని మాత్రమే. ఈ భయాన్ని జయిస్తే గాని మన వ్యక్తిత్వం బలపడదు. విద్యార్ధులు స్కూళ్లల్లో కాలేజీల్లో హాస్టళ్లలో ఉన్నపుడే ఏయే రూపాల్లో భయానికి లొంగిపోతున్నామా అని విచారించి చూచుకోవాలి. ఈ భయమనే పెనుభూతాన్ని జయించే ప్రయత్నం చేయాలి.