పుట:Loochupu-fr.Jojayya.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పకుంటున్నారు. కాని స్టెల్లామాత్రం ఓ మూల ఒంటరిగా కూర్చుంది. ఆ అమ్మాయి స్నేహితురాళ్లతో కలియదు. ఇతరులతో అట్టే మాట్లాడదు. మడుగులో ఒంటికాలిమీద నిల్చివున్న కొంగలాగ ఒంటరిగా ఉండిపోతుంది. ఈ ఇద్దరమ్మాయిలను గూర్చిన సంఘటనల్లో వ్యత్యాసం ఏమిటి? తెరేస్కు స్నేహితురాళ్లంటూ వున్నారు. స్టెల్లాకు స్నేహం అంటే ఏమిటో తెలియదు. మనం ఇతరులతో చెలిమి చేయాలి. ఇతరులను మనతో స్నేహం చేయనీయాలి. ఏ స్నేహితులు లేనివాళ్లు నిరుత్సాహంగా వుండి పోతుంటారు. విశేషంగా చిన్నప్రాయంలో యీ స్నేహగుణం చాలా అవసరం. స్నేహం కూడా ఓలాంటి ప్రేమే. కనుక స్నేహాన్ని మిత్రులనూ నిరాకరిస్తే ప్రేమనే నిరాకరించినట్లు. స్నేహమూ ప్రేమకూడా ఓ గొప్ప సాంఘికావసరం – Friendship and Love.

ఈ వ్యాసంలో సాంఘికావసరాలను నాల్గింటిని వివరించాం. అవి యితరులను అంగీకరించి గుర్తించడం, ఇతరుల పదవినీ సామర్థ్యాన్ని గుర్తించి వాళ్లను ప్రశంసించడం, ఇతరులతో కలిసిపోవడమూ ఇతరులతో సహకరి సూండడమూ, స్నేహమూ ప్రేమా. ఈ సాంఘికావసరాలను మన జీవితంలో మనం స్వయంగా తీర్చుకోవాలి. అలాగే ఇతరులూ వీటిని తీర్చుకోడానికి తోడ్పడాలి. ఈ యవసరాలను తీర్చుకున్న వ్యక్తులు సమాజంలో నిబ్బరంగా సులువుగా మెలుగుతూంటారు. ఈ యవసరాలను తీర్చుకొనని వ్యక్తులు సమాజంలోకి రాలేరు. సమాజంలో సులభంగా మెలగలేరు. ఎప్పడూ ఎవరిమీదనో ఒకరిమీద గొణుగుతూ నిరుత్సాహంగా జీవిస్తుంటారు. లేదా అనామకుల్లాగ ఓ మూలన పడివుంటారు. ఇక విద్యార్థులకు కాలేజీల్లో, స్కూళ్లల్లో జీవించేపుడే ఈ యవసరాలను తీర్చుకునే అవకాశాలు బోలెడన్ని లభిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. నేటి భారతదేశంలో సాంఘిక నాయకత్వం ఎంతైనా అవసరం. (17)