పుట:Leakalu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెంటాల హౌసు
మైలాపూరు ; మద్రాసు
7 జూలై 1909

ప్రియమైన అప్పారావు పంతులుగారు, *

మీరు పంపిన కన్యాశుల్కము, నీలగిరిపాటల ప్రతులు అందాయి, మీరు దయతో వాటిని బహూకరించినందుకు నేను మిక్కిలి కృతజ్ఞుణ్ణి, నాటకమును చదివి పట్టరాని ఆనందమును పొందాను; ఇదివరకే మీ నాటకం పలువురి ప్రశంసలను పొంది ప్రసిద్ధికెక్కింది. ఇంత ఉత్తమ నాటకాన్ని ఆంధ్రులకు ప్రసాదించినందుకు మీకు నా అభివందనాలు, మీరు ఏ భాషను పవిత్రమైనదిగా భావిస్తున్నారో ఆ వాడుక భాష నాటకంలో ముద్దుల మూట కడుతున్నది. మొదటినుంచి, చివరివరకు హాస్యరసము పాఠకుణ్ణి పరవశుణ్ణి చేస్తుంది. నాటక ఇతివృత్తం అతిగంభీరం; నిరంతర ఆసక్తి జనకం, కథా సంవిధానం చక్కగా అమరింది, నాటకం పెద్దదయినా సన్నివేశ చమత్కారంవల్ల సంభాషణల మాధుర్యంవల్ల పాత్రల అమోఘ చిత్రణవల్ల పాఠకుడు రచయితను తప్ప పట్టలేడు. మీ నాటకం జీవితాన్ని అతి సహజంగా చిత్రిస్తున్నది. ఛాందస శ్రోత్రియుడు, సంస్కర్త, దుర్మార్గుడు, మూర్ఖుడు, నేర్పులేని ఆడది, తమతమ మనఃప్రవృత్తులతో, మీ రచనలో పాత్రలుగ, మూర్తీభవిస్తున్నారు. నాటకంలోని పాత్రలు సజీవమైనవి. ఇక అవి చెక్కు చెదరవు.


  • రెంటాల వెంకటసుబ్బారావుగారి లేఖ.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/26&oldid=152986" నుండి వెలికితీశారు