పుట:Leakalu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శూరులం. మా తెలుగు స్త్రీలు హాయిగా అటూ ఇటూ మసులుతారు, స్వేచ్చగావుంటారు.

నా ఉపన్యాసం విని, యింత వొలంపాటి బెంగాలీ బాబూ, కంగారెత్తిపోయాడు. మొుహం నల్లబడింది. నా వాగ్ధాటికి నేనే పొంగిపోయాను. మళ్ళీ నాలుగింతలుగా విరుచుక పడ్డాను: "మీరు సబబైన మనిషిలా వున్నారు; తెలియక అడుగ తున్నాను; మరొకలా అనుకోకండి, స్త్రీలను అలాగ బంధించడానికి కారణం ఏమిటి? మీకు విద్యాసంపత్తి కొరవడిందా వాళ్ళను నేరస్థులవలె దండించడం దేనికి?"

ఆయన తనప్రక్కనే వున్న ఒక పండితుని వంక చటక్కున తిరిగి, నా ఉపన్యాసాన్ని ఖాతరు చేయనట్లు బెంగాలీ భాషలో ఏదో సణగడ మారంభించాడు. నాకు చిర్రెత్తు కొచ్చింది. ఏమిటీ నిర్లక్ష్యం. పరువునష్టంకింద అతన్ని జైలుకి పంపించాలన్నంత కోపం వచ్చింది. వొక తగుమనిషి, అపరిచితుడు, ఎదుట వున్నపుడు అతనికి తెలియని భాషలో తమలో "తాము మాట్లాడుకోవడం బెంగాలీల కొక దురలవాటు. ఇంతకీ నాతో మాట్లాడడానికి ఎవరికీ నోరాడిందికాదు. బహుశా, నా రాక వాళ్ళని హడలెత్తించి వుంటుంది.

సమావేశం ముగిసింది. అలికిడి లావయింది. నా మిత్రుడు దుబిన్ బాబు ఆ అలికిడిలో తన్మయుడై పోయాడు. తన స్నేహితులతో ఏదో హుషారుగా ముచ్చటిస్తున్నాడు. నేనిక్కడ వున్నట్టు చివరికి జ్ఞాపకంవచ్చింది కాబోలు, గబగబ నావద్దకు వచ్చాడు : “మన్నించండి, స్నేహితులతో మాట్లాడుతూ వుండిపోయాను."

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/10&oldid=152975" నుండి వెలికితీశారు