పుట:Lanka-Vijayamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

9


ఉ.

ఆమిథునంబునం దుదయమై విలసిల్లిరి సింగమంత్రియున్
శ్రీమహనీయుఁ డై వెలయు కృష్ణసుధీమణియున్ లసద్యశో
ధాములు దీక్ష్ణధామహిమధాములయట్లు విభాకళాఢ్యులై
హైమమహీద్రమంధరము లట్లు సమంచితధైర్యసారులై.

35


క.

అందగ్రజుండు శాత్రవ
బృందారణ్యాన్యనలుఁడు పృథుబలుఁ డురుధీ
బృందారకగురుఁ డతిధృతి
మందరుఁ డన నెగడె సింగమంత్రి నిపుణతన్.

36


క.

ఆసింగవిభువరుండుమ
హాసిం గదనమున విపుల నణఁచును లంకా
వాసిం గకుత్స్థకులజుఁడు
వాసిం గడతేర్చినట్లు వరుస దలిర్పన్.

37


సీ.

ప్రకటమౌ గణపతిరాజువారిజమీది
        వాన్గిరీ చేసె నేవరవిభవుఁడు
బహుదేశభూపసభాపూజ్యుఁ డగుచు నం
        దలమెక్కి తిరిగె నేతరణి తేజుఁ
డన్నపానీయవస్త్రాదుల నర్థులఁ
        దృప్తులఁ జేసె నేదీప్తయశుఁడు
సంగీతసాహిత్యసరసవిద్యలకు నా
        శ్రయుఁ డనఁ దనరె నేచతురబుద్ధి


గీ.

యతఁడు హరిభక్తుఁ డర్హధర్మానురక్తుఁ
డార్యజనహితుఁ డతులగాంభీర్యయుతుఁడు
చారురూపస్మరుఁడు సదాచారపరుఁడు
రుచిరగుణపాళి సింగనసచివమౌళి.

38