పుట:KutunbaniyantranaPaddathulu.djvu/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 184

భావిస్తారు. దీనికి వారిలో కొన్ని తప్పు అభిప్రాయాలు వుండటమే కారణం. పురుషులకి ఏ విధంగా వీర్యస్కలనం అయి తడి తడిగా స్పష్టంగా తెలుస్తుందో అదే విధంగా తమకు కూడా ఒక రకమైన స్కలనం అవుతుందనీ, ఆ స్కలనం అయితేనే గర్భం వస్తుందనీ భావిస్తారు. దానికి తగ్గట్టుగా వారిలో కామోద్రేకం బాగా కలిగినప్పుడు యోని దగ్గర పల్చని ద్రవం ఊరి తడి తడిగా గుర్తించడం జరుగుతుంది. తమలో కూడా పల్చని ద్రవం స్కలనం అయితేనే గర్భం వస్తుంది. కనుక అసలు రతిలో ఎక్కువ ఉద్రేకపడకుండా ద్రవాలు యోనిదగ్గర వూరకుండా చేసుకుని గర్భం రాకుండా దాంపత్య సంబంధం కలిగి వుండవచ్చని భావిస్తూ వుంటారు. అయితే సంతాన నిరోధక పద్ధతికి ద్రవాలు వూరకుండా కామాన్ని అదుపులో వుంచుకునే దానికి ఏమీ సంబంధం లేదు. స్త్రీకి కామోద్రేకం కలిగినప్పుడు యోని వదులు అయిపోవడం, యోని దగ్గర ద్రవాలు వూరడం మామూలుగా జరిగే విషయం. ఈ రకంగా తయారయిన ద్రవాలు యోనిలో వీర్యకణములు త్వరత్వరగా పయనించడానికి అవకాశం కలిగించినా, ఆ ద్రవాలు వూరడం జరగకపోయినా, స్త్రీకి కామోద్రేకం కలగకపోయినా వీర్యకణములు మాత్రం గర్భాశయంలోకి పయనించే శక్తి కలిగి వుంటాయి. అందుకనే కొందరు స్త్రీలు ఏనాడూ రతిలో సుఖప్రాప్తి పొందకపోయినా, రతిలో జడత్వం కలిగివున్నా పిల్లల్ని కనడం జరుగుతుంది.