పుట:KutunbaniyantranaPaddathulu.djvu/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 174

గర్భిణీ స్త్రీలో వచ్చే మరికొన్ని మార్పులు

గర్భవతి అయిన స్రీలో వచ్చే మార్పులు వేవిళ్ళు కనబడడం మాత్రమే ఒక ప్రత్యేక మార్పుగా కొందరు భావిస్తారు. గర్భిణి స్త్రీకి వేవిళ్ళు రావడం, వక్షోజాలు బరువుగా, బిగుతుగా మారడమే కాకుండా ఇంకా అనేక శారీరక మార్పులు వస్తాయి. స్త్రీ గర్భవతి కానప్పుడు గర్భసంచి 3 అంగుళాల పొడవు, రెండు ఔన్సుల బరువు మాత్రమే ఉంటుంది. కాని గర్భవతి అయి నెలలు నిండుతూ వుంటే గర్భసంచి 12 అంగుళాల పొడవు ఉండటమే కాకుండా 2 పౌన్లు బరువు కూడా పెరుగుతుంది. దీనికి గర్భసంచికి కండ పెరగడం ముఖ్యకారణం.

ఈ రకంగా గర్భసంచికి సంబంధించిన కండ పెరగడానికి ఈస్ట్రోజోన్, ప్రొజిస్టిరోన్ హార్మోనులు కావచ్చు. సాధారణంగా స్త్రీ గర్భవతి కాగానే బహిష్టుస్రావం కనబడటం ఆగిపొతుంది. కాని అరుదుగా కొందరిలో నెలతప్పిన మొదటి రెండు మూడు నెలలు కాస్త బహిష్టుస్రావం నెల నెలా కనబడుతుంది.

గర్భవతి అయిన స్త్రీలల్లో కొందరికి నెలలు నిండుతున్న కొద్దీ తెల్లబట్ట అవడం జరుగుతుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలో గర్భాశయ కంఠం రక్తాదిక్యతవల్ల మెత్తబడుతుంది. ఈ రక్తాధిక్యతవల్ల అక్కడినుంచి ఒక పల్చని ద్రవం ఊరుతూ ఉంటుంది. అంతేకాని అదేమీ జబ్బు కాదు.