పుట:Kumbharaana020881mbp.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం పదునొకండు] కుంభ రాణా 85

గలయంజూచి] అమావాస్యరాత్రి, కాఱుమబ్బులు నలుదెసలు నావరించి యున్నవి. ఈ వృక్షశ్రేణులక్రింద నాకు నేనే యగపడుటలేదు! చినుకులు గూడ పుటపుట రాలుచున్నవి. అంతయు నాహృదయమువలె గాఢాంధకార మలీమసమైనిశ్శబ్ద సమాధిగ నగపడుచున్నది. [ఆలకించి] ఎవరిదా కాలిచప్పుడు? [మరల నాలకించి] కాదు, కాదు. చెట్లయాకులు కదలుచున్నవి. [పరికించి] ఇచ్చట ఎవ్వరును లేరు. వా రింతవఱకే వెడలిపోయి యుందురా? [కొంత పరిక్రమించి] అచ్చట నేదియో యొక యాకృతి కనఁబడుచున్నది. [కాలిచప్పుడు కాకుండ దగ్గఱకుపోయి కత్తితో పొడుచుట నభినయించి] ఓ! తరుకాండము! అగ్బ రని భ్రమించితిని!

[వెదకుచుండును.]

[కుమారసింహుఁడు ఖడ్గహస్తుఁడై ప్రవేశించును.]

కుమారసింహుఁడు : [స్వగతము] నే నెచ్చట వెదకినను వారిరువురు నగపడలేదు. ఈ చెట్ల నీడలో దాగుకొని యుందురు. [అటునిటు పరికించి] అదిగో! చీకటిలో నస్పష్టముగ నటునిటు తిరుగుచున్న వ్యక్తియె అగ్బరు పాదుషా. ఆతని యీకత్తిచే నొక్క పోటు పొడిచి నా స్వామి ఋణమును దీర్చుకొందును. [మెల్లగాపోయి పొడిచి] అగ్బర్ పాదుషా, యిది యుదయపూర్ రాజ్యాధిపతి యాజ్ఞ. నీ దుండగమునకు దగిన మరణదండనము - నా స్వామి ఋణము దీర్చుకొంటిని.

రాణా : [తరుకాండమున కానుకొని బాధ నభినయించుచు] అయ్యో! ప్రమాదము! కుమారా, చచ్చితిని, చచ్చితిని.

కుమా : [దు:ఖోద్వేగముతో] హా! స్వామి ఘాతుకుడను. అయ్యో, తండ్రీ, నీవేల యింతలో నిచ్చటకు వచ్చితివి? హతవిధీ, తలపట్టి యీడ్చుకొని వచ్చితివా? ఈదు:ఖము దుర్భరము. మీ సేవకుడు మిమ్ము ననుసరించుచున్నాడు. [నడుము కట్టులోనున్న ఖడ్గముదూసి పొడుచుకొని]