పుట:Kumbharaana020881mbp.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము తొమ్మిది] కుంభ రాణా 81

కుమారసింహుఁడు : [స్వగతము] హా! అగ్బరు పాదుషా! రాణా కెఱింగించెదను. [పోఁబోయి] అయ్యో! ఆజ్ఞ లేదే ! అయినను ఈ వార్త రాణాకు ప్రియముగ నుండవచ్చును. తడయజనదు. [నిష్క్రమించును]

తాన్ : ఎవరో పరుగెత్తుచున్నటుల కాలిచప్పు డగుచున్నది!

మీరా : పాదుషా, నీవు నాకుఁ బరమ బంధుఁడవు. నీమూలమున నాకు బంధవిముక్తి కలిగినది. నీవు నిమిత్త మాత్రమైన కీలుబొమ్మవు, సూత్రధారుఁడు సర్వేశ్వరుఁడు.

అగ్బ : తల్లీ, యీ మరణోద్యోగము నుండి విరమింపుము. నా వలన నీవు మరణింప వలసివచ్చె నన్న దు:ఖము సహింపఁజాలను.

మీరా : పాదుషా. అజ్ఞానలేశము నిన్నింకను ఆవరించియున్నది. పరలోకము భయంకరమను అపోహయు, ఇహలోకముపైఁ గల అత్యంత మమతయు మరణమాధుర్యమును విషవంతము చేయుచున్నది. జీవితము నిరంతర ప్రవాహము - ఆద్యంతములు లేనిది. ఒకచోటి చావు మఱియొక చోటి పుట్టుక.మరణము భౌతికపరిణామము. అనివార్యము. అందుకు చింతయేల?

అగ్బ : అమ్మా, మరణ మనివార్యమైన యెడల దానిని జయించుటకు మార్గము లేదా?

మీరా : కలదు. మరణమును చిఱునవ్వుతో నెదుర్కొనుటయె విజయోపాయము.....హృదయేశ్వరా,...యిదిగో! వచ్చుచున్నాను. వాఁడు గో! నా మనోవల్లభుఁడు, నన్ను పిలుచుచున్నాఁడు. [కదలును]

అగ్బ : [పాదములపైఁ బడి] తల్లీ, మన్నింపుము. నిలువుము. నిలువుము!

మీరా : [తొలఁగి] పాదుషా, నన్నంటకుము. [నిష్క్రమించును.]