పుట:Kumbharaana020881mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఎనిమిది] కుంభ రాణా 71

రాణా : ఏలనో కనుగొండు. ఇప్పటికైనఁ దెలియవచ్చినదా మీ రాణిగారి పూజ్య ప్రవర్తనము ?

శ్యామ : [ఆలోచించి] మహాప్రభూ, రాణిగా రేమియు నసత్యమాడలేదు. వైద్యులు వచ్చిన సంగతియే యామె యెఱిగియుండదు.

రాణా : శ్యామలరావ్, మంచి వూఁతమాటలు ! మీరా ప్రాణరక్షణోద్యమము ప్రశంసనీయ మైనను మాకుగల గౌరవమును బలి యీయ నెంచుట నింద్యము.

శ్యామ : పరాభిప్రాయమునించుక సహించుఁడు. నిజము తేలఁగలదు. భక్రిపరవశురాలైన రాణిగారికి వైద్యులు వచ్చునప్పటికి నిహలోక జ్ఞానమంతరించి యుండినది.

మాధ : ఉండవచ్చును.

రాణా : [గంభీరముగ] నా యదికారము నెల్లిదము సేయుటకు మీరు కృతనిశ్చయులైనట్లున్నది. - కానిండు.

శ్యామ : తప్పదలఁచితిరి. మేము న్యాయైక పక్షపాతులము. నిరంతరమును దేవరవారి మేలుగోరు మంత్రులము. మా విధిని నిర్వర్తించుచున్నాము.

రాణా : ఏల యీ వ్యర్థప్రసంగము? నానమ్మకము అవిచార మూలకముగాదు. సత్యము నూహించితిని. నిజ మెఱిఁగిన వెనుక నాకర్తవ్యమును అనుకూలముగ మఱచునంతటి భీరువునుగాను - స్వార్థపరుఁడనూ గాను. నా సంకల్పము న్యాయ్యము. నా న్యాయ్యసంకల్పము శాసనము. నా శాసనము పొల్లుపోవక కొనసాఁగి తీఱవలయును.

శ్యామ : మీ యాజ్ఞ కేలము ధర్మబాహ్యము. మా యంతరాత్మకు విరుద్ధమైన కార్యము మేము చేయఁజాలము. మమ్ము నుద్యోగ విముక్తులను గావింపుఁడు.

రాణా : [ఆశ్చర్య కోపములతో స్తంభితుఁడై చూచి] ఏమీ ? -