పుట:Kumbharaana020881mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు

తోత్తముఁడు, మోక్షార్థియై భక్తిభావనతో అతఁడు మీరాను సేవింప వచ్చెను. ఇంతియేనా ?

శ్యామ : చిత్తము.

రాణా : చక్కగానున్నది విషయకల్పనము! విపరీత వ్యాఖ్యానమునకు కూడ నొక హద్దుండవలయును. ఆత్మవంచనమునకు పరస్పర ప్రతారణమున కిచ్చట నవకాశములేదు. నా వివేకమును మీ రనుమానించు చున్నట్లున్నది. నేను పసిపాపనుగాను [ఉద్రేకముతో] నేను తిరస్కరింపఁబడితిని. వంచింపఁబడితిని. నాబలము, నాశౌర్యము, నాయభిమానము, నాగౌరవము - తుదకు నాస్థితియె ధిక్కరింపఁబడినది, తృణీకరింపఁబడినది. పట్టపగలే నా యంత:పురము గణికా మందిర మైనది. ఇఁక నేమి కావలయును ?

మంత్రులు : రామ! రామ! పాపము శాంతిల్లుఁగాక !

రాణా : [దు:ఖగద్గద స్వరముతో] నా యాశాలేశముకూడ భగ్నమై పోయినది. [మీరాబాయి నుద్దేశించి] మీరా, ఇఁక నీవు నాప్రేమకుఁ బాత్రమవు కావు. నా సంసార మసారమైనది. సుఖస్వప్నము ఆతర్కితముగ భిన్నమైనది. మీరా, నీవు చావ వలయును ! చావ వలయును !

శ్యామ : [తత్తరముతో] మహప్రభూ, - ఏమి నిర్ణయించితిరి. ఘోరము! ఘోరము! ఈ తొందర పాటునకుఁ బశ్చాత్తప్తులు కాఁగలరు. వెనుక చింతించుటకంటె ముందుజాగ్రత మేలు. కోపోద్రిక్త మానసులయి సత్యము నెఱుంగఁ జాలకున్నారు.

రాణా : దుర్బల హృదయులై మీరు సత్యము నెదుర్కొనభయపడుచున్నారు. మీరా భక్తురాలను మీ దురభిప్రాయము సత్య సందర్శనమున కడ్డువడుచున్నది. ఆమాయలాడి రక్తపాతమునఁగాక యీ యపయశో మాలిన్యము సమ్మార్జితముకాదు.

మాధ : హరి! హరి! కొంచెము తడవిండు. నిజము నిలుకడమీఁద తేలఁగలదు.