పుట:Kumbharaana020881mbp.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు

రాణా : కానిమ్ము.

మురళి : చిత్తం మహప్రెభో - ఆ సాలలో యిద్దరు ముసాఫర్లు పండుకోని నిద్రపోతుండినారు. వాళ్ళను లేవగొట్టి మూటాముల్లె భద్రమని యెచ్చరించాను. నేనెప్పటికి ప్రతి బాటసారిని కఱ్ఱతో తట్టి లేపి కాగడా బట్టి చూస్తుంటాను. అందువల్లనే నా ఫారాలో వొక్క దొంగతనమైనా పోలేదండి ధొరగారూ. అదంతా ప్రెభువుల కెరికె.

రాణా : అధిక ప్రసంగము చేయకుము. శీఘ్రముగ ముగించుము.

మురళి : [భయముతో] చిత్తం మహప్రెభో - మాటామాటలో మా యింటి మంచీ శెబ్బరా చెప్పుకొన్నాను. వాళ్ళల్లో నొకాయన నామీద కనికరంపుట్టి వొక మోరియ్య యినామిచ్చినాడు. ఇంతకంటె చిల్ల పెంకెత్తుగూడా యెత్యాషం జరగలేదండి ధొరగారు. [దండము పెట్టును.]

రాణా : వారు వైదేశిక యాత్రికులా, బైరాగులా ? వారిపై నీ కేమైనా అనుమానము తట్టలేదా?

మురళి : వాళ్ళు దొంగల్లాగా లేరండి మహప్రెభూ, పెద్ద పెద్ద నామాలు, తొళిసిపూసల దండలూ చూస్తే భక్తుల్లాగా కనబడ్డారు. నా యంటివాణ్ణీ గూడా 'అయ్యా' అని పెద్దమణిశినిలాగా పలకరించారు.

రాణా : అందుకే యుబ్బి తబ్బిబ్బులయి నీయుద్యోగ విధులను మఱచితివా ? అడిగినంతనే బంగారు మొహిరీల విసరి పాఱవేయఁగల సంపన్న యాత్రికులు బిచ్చ గాండ్రకయి కట్టింపఁ బడియున్న పాంథశాలలలో నివసింతురా ? ఓరీ, మూర్ఖుడా, నీగాడిద బుద్ధిచే మానవాకృతి దూషింపఁబడినది. [మంత్రులతట్టు తిరిగి] రావుజీ, యీబాటసారులే యావేషధారి వైద్యులు.

శ్యామ : అట్లే తోచుచున్నది. ఆ దునీచందుశేటును పిలిపించెదము. ఆతఁడు రత్న వ్యాపారముచేయు గొప్ప షాహుకారు. అతనిచేత ఈ హారమునకుగూడా మదింపు వేయింపవచ్చును.