పుట:Kumbharaana020881mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము ఏడు] కుంభరాణా 53

రాణా : ఆ హారమును దీసికొండు.

సుశీల : [సిగ్గుపడుచు హారముదీసి వినయ మభినయించుచు దూరము నుండి బలవంతరావుచేతి కందియిచ్చును]

బల : [రాణాచేఁత బెట్టును]

రాణా : [పరీక్షించుచుండును.]

సుశీ : [స్వగతము] ఎవరైనా నన్ను మోసంచేసి వుండరుగదా ?

రాణా : దాసీ, నీ కీహార మెక్కడిది ? మాబొక్కసములోని ధనమంతయు వెచ్చించినను దీని మూల్యమునకు సరిపోదు.

సుశీ : [స్వగతము] అబ్బో! అట్టాంటి హారమా యిది ? యెంత వెఱ్ఱి ముండను. దాచైనా పెట్టుకోక పోతిని.

రాణా : ఏమి యాలోచించుచున్నావు ? కట్టుకథ లల్లకుము. యధార్థము చెప్పుము.

సుశీ : నిన్నటిదినం రాణిగారికి మందియ్యడానికి వచ్చిన వైద్దుగులు ఈహారము ఇచ్చిపోయినట్లుంది.

రాణా : ఊహించుటయేమి ? నీవు చూడలేదా ?

సుశీ : [భయముతో] రాత్రంతా అమ్మగారికి విసుర్తూనే వుండి నిద్రలేక అప్పుడే కన్నట్ట మాల్చాను.

రాణా : ఓహో ! కన్నుమాల్చితివా ?

సుశీ : తర్వాత రాణిగారు నన్ను దగ్గరికి పిలిచి "ఒసె సుశీలా, ఇక్కడ వుండే దాసీల్లోకెల్లా నీవుకొంచెం ముక్కూ మొగం అందంగా వుండేదానివి, ఈహారం నీకైతే తగివుంటుంది" అని నేను వద్దనేకొంది నా మెళ్ళోవేశారు.

రాణా : [కోపముతో] ఓసీ, బుద్ధిలేనిదానా, నీసౌందర్యవర్ణనముతో మాకిప్పుడు పనియేమి ? మీరాకు ఆవైద్యులు ఈవజ్రహారము నిచ్చిరా? లేక అంతకుముందే ధరించియుండినదా ?