పుట:Kumbharaana020881mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము మూడు] కుంభ రాణా 23

మీరా : ఆమందుకొఱకె నిరంతర మన్వేషించుచున్నాను. చేతికి చిక్కీ చిక్కక మాయగారడివలె మఱిఁగిపోవుచున్నది. ఆమందు దొఱకిన నా పిచ్చియే కాదు, లోకము పిచ్చిగూడ కుదురును.

రాణా : [కోపముతో] మీరా, నీవిఁక పిచ్చిదానివికమ్ము, బిచ్చకత్తెవు కమ్ము, ఇంక నేదియైన కమ్ము, నీవుమాత్ర మిఁక నంత:పుర మర్యాదను దాఁటవలదు. సామాన్యస్త్రీలవలె అందఱికంటపడుచు నీవు కృష్ణమందిరమునకు పోవలదు. నీప్రవర్తనము నీయొక్కతెకే సంబంధించినదికాదు; మాపైకూడ ప్రతిఫలించును. ఉదయపూరు రాజ్యాధీశ్వరుని పట్టమహిషి పిచ్చిపట్టి వీథులవెంబడి తిరుగుచున్నదను అపవాదమునుండి కాచికొనుము.

మీరా : నాపై ఆస వదలితి నంటిరి. బిచ్చకత్తె నగుటకు సమ్మతించితిరి. దారిప్రక్కల దుమ్ముతోకూడ సరిపోలని నాకు అభిమానమేల ? ఆదురభిమానము పూర్వజన్మముతోడ నశించినది. దిక్కులేనివారికి దేవుఁడే తోడునీడ. బిచ్చమెత్తుటకు నాకు అనుజ్ఞయిండు; ఆలోకేశ్వరుని ముంగిట భిక్షాందేహియని నిలచెదను.

రాణా : నీపిచ్చికి నిన్ను వదలినను త్రాడుతెగినగాలిపటమువలె నిన్ను తిరుగనిచ్చుట నాకిష్టములేదు. ఇంకను నేను నీకు పతిని.

మీరా : అ కృష్ణుఁడొక్కఁడే ప్రాణేశ్వరుఁడు. లోకములోని జీవిలందఱును విరహిణులు.

రాణా : [కోపముతో] ఈపిచ్చి మఱింత ముదురుచున్నది. మీరా, నీవన్నమాట నీకుతెలిసివచ్చినదా ? - వినుము, ఇంకను నేనునీకు ప-తి-ని.

మీరా : నన్ను సేవకురాలిగ పనిగొండు. నామతమునకు నన్ను వదలుఁడు. అన్యమతస్థులే పూజ్యమైన హిందూమతమును స్వీకరించి సంసారమును తరించుచుండ మీరేల నాస్తికులగుట ?

రాణా : అన్యమతస్థులెవరు ?