పుట:Krxshhiivaludu (1924).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రిచ్చకు వచ్చినట్టి కతలెల్ల వచింపుచుఁ దెల్లవాఱఁగా
వచ్చిన మూటముల్లె గొను పైనపుసందడి రేఁగె గొల్లునన్‌. 4

అమ్మీ, తూరుపుదెల్లవాఱె, నిఁకలెమ్మా, యంచనన్‌ మాల్గి మం
చమ్మున్‌ డిగ్గక, బుజ్జగించినను, పో చాల్చాలు, వేన్నీళ్లు లే
కెమ్మై నేఁ బలుదోముకొందుఁ జలిలో, నింతాగడంబా, యటం
చమ్మం గూఁతురు కోపగించుకొనుఁ గన్యాత్వంపు గారామునన్‌. 5

ఉష యనెడు కాఁపుటిల్లాలు హొన్నురాజ
నముల వరియెన్నుగంప గేహమున దింప
సంబరమున నెగురుచు సరసఁజేరు
పిల్లలనఁ బుల్గుతుటుములు వింటికెగసె. 6

అరుణమయూఖముల్‌ తరులతాంతరమార్గము దూరి గేహగో
పురములఁ బ్రాఁకు ప్రొద్దువొడుపుం దరుణంబున నీటికోసమై
సరసుల కేఁగు కాఁపునెఱజాణల నూపురమంజులార్భటుల్‌
నెఱసెఁ బ్రభాతమన్‌ శిశువునేర్చెడి ముద్దులమాటలో యనన్‌. 7

ఇరువులఁ జూరులందుఁ జరియించి తమోహరణైక దక్ష భా
స్కర కిరణాళి నీమృదులశయ్య సువర్ణమయంబు చేసె ని
ద్దుర నిఁకనైనమాని వెలిదోలుము బీళ్ళకు నాలమంద, ని
త్తఱిఁ దమిదీఱమేయుఁ బులుదంటులుఁ గమ్మనిమంచుపచ్చికల్‌. 8