పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

36. పురాతన నూతనాంధ్ర ప్రబంధకవులు

పూర్వమునందుఁతెల్గునఁబ్రపూర్ణ రసోన్నతిఁ గావ్యరాజి ధీ
ధూర్వహులౌచు వ్రాసి పరితోషము నించిరి గాని యింతయే
గర్వముఁ బూనలేదటులఁగా కిపుడున్న కవుల్ కృతిక్రియా
నిర్వహణప్రవీణతకు నిగ్గక గర్వము గాంతు రక్కటా.

37. నన్నయ తిక్కనల కవిత్వము

ఇరువురి సత్కవిత్వమున నింతయులే దపశబ్దదోషమా
యిరువురి ప్రజ్ఞలున్ సమములేయగు నించుకభేద మెంచనా
తరమగునె కవీంద్రులు ప్రధానులు నన్నయతిక్కయజ్వలా
వరమతులన్ నుతించుటకు వాణియొ శేషుఁడొ రావలెన్ జుమీ

38. కృష్ణరాయల యాంధ్ర కవిత్వాభిమానము - కవిరాజ విరాజితము

తెనుఁగు కవిత్వమునందునఁ బ్రేమ యతి స్థిరమై విలసిల్లుటచే
నెనిమిదిమంది కవీంద్రుల గౌరవమిచ్చుచుఁ బ్రోచెను గృష్ణుఁడటుల్
ఘనులొకకొందఱు గల్గిరినేఁడు సుఖంబిడివారల మన్నననే
యు నరవరేణ్యులొకానొకచోఁదగియుండకపోరదియారయనౌ‌

39. నిశ్చయబుద్ధి లేనివాఁడు

అంతకుమున్ను దియ్యనిదన్న శర్కరఁ
          బాడు చేఁదనిపల్కుఁ బైత్యరోగి
అంతకుమునుబిడ్డయని యెంచిలాలించు
          దూడ యాఁబోతుగాఁగూడుఁ బశువు
అంతకుమున్న యుప్పనునుప్పుఁ బిదపఁగా
          దని చెప్పు సర్పవిషాకులుండు
అంతకుమున్నక్క యనుదాని నాలుగాఁ
          దాఱుమాఱుగఁజూచుఁ ద్రాగుఁబోతు