పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి (సిద్దేశ్వర పీఠాధిపతి; కుర్తాళం)

(పూర్వాశ్రమం : డాక్టర్ ప్రసాదరాయ కులపతి)

ఆశీర్వాద శ్రీముఖము

డా॥ గుండవరపు లక్ష్మీనారాయణ గారు చిరకాలంగా ఆప్తులు. సాహితీ రంగంలో ఎంతో కృషి చేసినవారు. కొప్పరపు సోదర కవులయందు వారికి గల భక్తి అపారము. దాని ఫలితమే ఇంతకుముందు వ్రాసిన గ్రంథము, ఇప్పుడు సిద్ధమైన మరొక బృహద్గ్రంథము. నిర్భయంగా నిస్సంకోచంగా ఎన్నో వివాదాస్పద విషయాలు ఇందు ప్రస్తావించబడినవి. ఈ మాటలు ఎందుకు అనవలసివచ్చిందంటే చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు చిరకాలం జీవించి ఆస్థాన కవియై అప్రతిహత తేజస్సుతో ప్రకాశించటం, వారి శిష్యులు మహామహులై గురుకీర్తిని దిగంతవ్యాప్తం చేయటం జరిగి - ఒక దశలో కొప్పరపు సోదర కవులను గురించి వారి కవితా మహత్వాన్ని గురించి ప్రకటంగా పలకటానికి పండితులు - తెలిసినవారు కూడా భయపడే స్థితి వచ్చింది. మాకు పూజ్యుడైన ఒక వృద్ధ పండితుడు ఈ సోదరకవుల జీవిత చరిత్ర వ్రాసి తన పేరు పెట్టుకోవటానికి ఇష్టపడక మరొకరి పేరుతో ప్రకటించటం నేను స్వయంగా చూచిన సత్యం. తెరవెనుక జరిగిన యిటువంటి విశేషాలనెన్నింటినో నేను ఎరుగుదును.

ప్రస్తుతం లక్ష్మీనారాయణ గారు పూర్వం కుంటముక్కల జానకి రామశర్మగారు ప్రచురించిన గ్రంథం ఆధారంగా ఈ పుస్తకాన్ని తయారుచేసి అలభ్యతా దోషాన్ని నివారించారు. వారి ఆలోచనలు, వివరణలు తయారుజేశారు. అయితే వారుకూడా తీవ్రత్వ సంకోచంతో నెల్లుట్ల రామకృష్ణామాత్యుల భావార్ణవ పద్యాలను పరిహరించారు. దూషణ ఉన్నా కవిత్వం బాగున్నది కనుక తిట్టు కవిత్వ శీర్షిక క్రింద ఉపయోగించవచ్చు. పాటిబండ్ల వారివి, వఝ వారివి, కాళ్ళకూరి వారివి, మరికొందరివి మరికొన్ని ఇవ్వవచ్చు. అయితే ఇప్పటికే గ్రంథం పెద్దదయినది.

ఇవన్నీ అటుంచి రచయితకు తనదైన ఒక ప్రణాళిక ఉంటుంది. గుండవరపు వారు తానెన్నుకొన్న పద్ధతిలో రచన చేశారు. అది బాగుంది. దానిని