పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45


విశదల శతావధానము

(17-09-1911)

శ్రీరంజిల్ల శతావధానమిచటన్ జేయంగ నూహించితిన్
బ్రారూఢిన్ నినునమ్మి యిమ్మహిత సభ్యశ్రేణి మెచ్చంగ నీ
కారుణ్యామృతబిందువుల్ చిలికి విఖ్యాతిన్ విడంబింపవే
ధారాశుద్ధియు ధారణాధికతయున్ దార్కాణగా శాంభవీ

కుశలుఁడు సత్యవాది చెరుకూరి కులుండు మదారివారణం
కుశము కవిప్రియుం డఖిలకోవిదవంద్యచరిత్రుఁ డుల్లస
ద్విశద యశోభిరాముఁడగు తిర్పతినాముఁడు పిల్వనేఁడు నీ
విశదలఁజేయు సత్సభను వేడుకఁజూడుము మల్లికేశ్వరా

1. ఆంజనేయ స్తవము

ఎవ్వనినమ్మి దేశములకెంతయుఁబోయి జయంబు గంటిమో
యెవ్వనినమ్మి యీ సభ నహీనధృతిన్ జరగించుచుంటిమో
యెవ్వనినమ్మి యేమిటనొకింతయు సందియమందకుంటిమో
యవ్వరకీర్తిశాలి పవనాత్మజుఁ డేలుత మిమ్ముమమ్మునున్

2. మల్లీశ్వరస్వామి ధ్వజముఁగూర్చి యుత్ప్రేక్ష

ఈమల్లీశ్వర దేవు కోవెలధ్వజంబింపొందు నత్యున్నతిన్
ధీమంతుల్ వినుతింప ఘంటలధ్వనుల్ నిత్యంబు మాస్వామిఁదా
నేమాన్యాత్ముఁడు గొల్చునాతనికి లే దేలాటి పాపంబటం
చామోదంబునఁదెల్పు శూలిభటులోయంచున్ వితర్కింపఁగన్