పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
44


నెన్నుకొనఁబడిరి. సోదర కవులలో జ్యేష్ఠులగు బ్రహ్మశ్రీ సుబ్బరాయ కవిగారు పగలు షుమారు 1 1/2 గంటలకు శతావధానముఁ ప్రారంభించి రాత్రి 12 గంటలగు వఱకు ముగించిరి. కూరుచున్న వారిలోఁ బలుగురు రాజకార్యముల నిమిత్తము మఱునాఁడు గుంటూరికిఁ దిరిగి వెళ్ళవలసిన వారగుటచేఁ బృచ్ఛకుల సంఖ్య నలువది యొకటికి మించనీయఁబడలేదు. అవధానము జరుగునంత కాలము కవిగారు పృచ్ఛకుల మధ్యము నుండి కదలనే లేదు. నడుమ నడుమ సభ్యులడుగు ప్రశ్నలకు సమాధానములుగా ననేక పద్యములఁ జదువుచు ననేకముల నాశువుగాఁ జెప్పుచుఁగూడ వచ్చిరి. పృచ్ఛకులలోఁ గొందఱు తమకుబదులొరుల నియమించియుఁ గొందఱు తమకాగితముల నెవరిమీఁదనో పడవైచియు నడుమ నడుమనే సగముకంటె నెక్కుడుగా జారి పోయిరి. అయినను సగముమేని వానికరుణఁ గవిగారి ధారణ చెడక యవధానము నిరాఘాటముగా నెఱవేఱినది. సమస్యలును బ్రశ్నలలో గొన్నియును విషమములుగా నున్నను బద్యములలోఁ కొన్ని మహాకావ్యములలో నుండి వానికి వన్నెతేఁదగినవిగా నున్నవని గుణగ్రహణ పారీణులగు వారికిఁదోఁపక మానదు. లోపము లెంచఁజూచినచో మహాకవులు సావకాశముగా రచించిన ప్రబంధములలోనే కన్పట్టుచుండ నాశువుగాఁ బృచ్ఛకులయు సభ్యులయుఁ దొందరలతోఁ జెప్పఁబడిన కవిత్వములోనా దొరకకుండుట? ప్రకృతావధానము జ్యేష్ఠ సోదరుల సామర్ధ్యము మాత్రమే చాటు చున్నను గనిష్ఠులును దక్కువ వారుకారని నే నెఱిఁగినదానినిబట్టి చెప్పఁగలను. వారి సమస్యాపూర్తి యొక్కటి యిందుఁబొందుపరుపఁబడియునున్నది. భగవంతుఁడు వీరికి దీర్ఘాయురారోగ్యైశ్వర్యము లొసంగి వీరనేకములగు సుద్గ్రంథముల నొనర్చి దేశీయుల మనంబుల రంజిల్లఁజేసి శాశ్వతకీర్తి గడించునట్లు వీరికిఁ దోడ్పడుఁగాత.

ఈ చిన్నపుస్తకములో నవధానము మఱునాఁడు కొందఱు వీరిని గుఱించి వ్రాసియిచ్చిన పద్యములుఁ గొన్ని గలవు.

ఇట్లు,

పాటిబండ సూర్యనారాయణరావు

22-9-1911