పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43


శ్రీ కనకదుర్గాంబాయై నమః

విశదల శతావధాన పీఠిక

బాలసరస్వత్యాశుకవిచక్రవర్త్యాది బిరుదాంచితులగు శ్రీ కొప్పరపు సోదర కవులను గూర్చి పండిత ప్రకాండులు వ్రాసి పంపిన పద్యములు మొదలయినవి కొన్నియు, వారిచేఁ జేయఁబడిన సమస్యా పూర్తులు కొన్నియు నొక చిన్న పుస్తకముగా సంగ్రహింపఁబడియెను. వారి కవితాశక్తి యసమానమైనదని యందువలననే కొంత తేటపడకమానదు. అందలి యంశములన్నియు నప్పటప్పటి వార్తాపత్రిక లలోఁ బ్రచురింపఁబడినవేయైనను నాత్మదోషంబు కతనఁ గొందఱు విశ్వసింపఁజాల కుండిరి. తన కన్నులతోఁ జూచుచుండిన భర్చువను తన మంత్రి బ్రతికి యున్నట్లు విశ్వసింప లేకపోయిన రాజుకథవినమె? ఇట్లు వీరి రసనాగ్రసీమల యందు సహజ సముత్పన్నయైన కవితాలతికకు దృష్టి దోషంబుదగిలి యందుద్భవించిన యశః పుష్పంబులు వాడునో యను శంక దూరదృష్టిలేని కొందఱు జనంబుల మనంబులఁ బొడమఁ దొడంగెను. ఇట్టి సమయంబున నీ గుంటూరు పట్టణంబునకు సమీపంబుననున్న విశదలగ్రామ నివాసియును గమ్మవంశజుండును నిరుపమాన మల్లీశ్వర దేవతాయతన నిర్మాణ జనిత నిర్మల కీర్తియునగు శ్రీ చెరుకూరి తిరుపతిరాయ మహాశయుండు పై యంశములను దెలిసినవాఁడై యీ సోదరకవుల సామర్ధ్యము స్వయముగా వీక్షింపనెంచి మిత్రజనంబుల ప్రోత్సాహంబున స్వగ్రామంబున నొక సభ సమకూర్చె. ఈనెల 17వ తేది ఆదివారమునాఁడు విశదలలో శ్రీమల్లీశ్వర స్వామివారి దేవళముముంగిట సభ జరిగెను. గుంటూరు నుండి యనేకులు న్యాయవాదులును, నుద్యోగీయులును నచ్చటినుండియుఁ జుట్టు పట్ల నుండియుఁ బెక్కురు పండితులును, గవులును విచ్చేసియుండిరి. బ్రహ్మశ్రీ కొండా వేంకటప్పయ్యపంతులు, బి.ఏ., బి.ఎల్., గారగ్రాసనాధిపతిగా సభ్యులచే