పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరిని పరిచయం చేస్తూ ఆదిపూడి ప్రభాకర కవి చెప్పిన 64 పంక్తుల చంపకమాలిక 'శారద' పత్రికలో(1924) ప్రచురితమై ప్రసిద్ధమైంది. వేంకట సుబ్బరాయశర్మ గారి మరణానంతరం వేంకటరమణ కవి గారు తమ సోదరులైన బుచ్చి రామ కవితో కలిసి ఆశుకవితా సభలు చేశారు. వీరు అవధానాలలో లక్షల కొద్దీ పద్యాలు చెప్పారు.

'కనకాంగి' ఒక అవధానంలో ఆశువుగా చెప్పిన కథా కావ్యం . 'పసుమర్తి వారి వంశావళి' ఆశుధారలో చెప్పిన గ్రంథం. ఇందులో పసుమర్తి సీతారామయ్య, రామయ్య గార్ల వంశానుక్రమణిక ఉంది. 'జ్ఞానోపదేశము' తిరుపతి కవుల హితోపదేశానికి ప్రతిగారాసిన గ్రంథం. 'నారాయణాస్త్రం' తిరుపతి వేంకట కవుల 'నమస్కారానికి' సమాధానం. సుబ్బరాయ శతకం నరసారావు పేట వాస్తవ్యుడైన నాగరపు సుబ్బరాయ శ్రేష్టికి అంకితంగా ఉంది. ఇది గీతశతకం, వీరి రచనలు సంప్రదాయ రీతిలో ప్రాచీన ప్రబంధాల పోకడలో ఉన్నాయి. మణికొండలో తేటిరెడ్డి గోపాలరెడ్డి నుంచి 'బాలసరస్వతి' బిరుదును, నెల్లూరు మహాసభలో 'ఆశుకవీంద్ర సింహ' బిరుదాన్నీ, బుచ్చిరెడ్డి పాలెంలో బెజవాడ పట్టాభిరామరెడ్డి గారి చేత 'విజయఘంటికా' బిరుదాన్నీ, మద్రాసు విజ్ఞాన చంద్రికా మండలి వారి నుంచి 'ఆశుకవి చక్రవర్తి' బిరుదాన్ని పొందారు. గుంటూరులో 'కుండినకవి హంస' బాపట్లలో 'అవధాని పంచానన' మార్టేరులో 'కథాశుకవీశ్వర' గుంటూరు సోమసుందరేశ్వరాలయంలో 'కవిరత్న' బిరుదాలు పొందారు. కొప్పరపు కవులు వడ్లమూడిలో చేసిన అవధానంలో పృచ్ఛకులుగా ఉన్న కుంటముక్కల వేంకట జానకీ శర్మ 'కొప్పరపు సోదర కవుల శతావధానములు' అనే పేర వారి అవధానపద్యాలను రెండు భాగాలుగా ప్రచురించారు (1963). చిరుమామిళ్ళ లక్ష్మీనారాయణ ప్రసాదు గారు 'కొప్పరపు కవుల యశోడిండిమం' సంకలితం చేశారు. నిడుదవోలు వేంకటరావు గారు రచించిన 'కొప్పరపు సోదర కవుల చరిత్ర' (1973) వీరిని గురించిన విశేషాలు తెలుపుతున్నది. ఈ సోదర కవుల పేర ఒక ట్రస్టు ఏర్పాటైంది. (1965).

(తెలుగు అకాడమీ సౌజన్యంతో:

“తెలుగు సాహిత్యకోశము 1851-19507 నుండి)