పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. తుమ్మల సీతారామమూర్తి చౌదరి (1901-1990)

ఆధునికులలో సంప్రదాయవాది. సనాతనులలో అధునాతనుడు, కవితా సృజనలో దేశభక్తుడు. అన్నీ కలిపి త్రిపాత్రాభినయం అనడానికి వీల్లేని త్రివేణీ సంగమం. గ్రామజీవనం, గాంధీతత్వం, ఆంధ్రాభ్యుదయం, తెలుగు “బాస"- ఈ "అభినవ తిక్కన" చతురంగబలాలు.

9. పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-1990)

తన కవితాగ్రంధం తనకే పాఠ్యపుస్తకంగా నిర్ణయమై విద్వాన్ పరీక్షలో ఆ గ్రంధానికి సంబంధించిన ప్రశ్నలకు విద్యార్ధిగా సమాధానాలు వ్రాసుకోగలిగిన అదృష్టం దృష్టమైన అపురూపకవి. బహుభాషావేత్త, బహుగ్రంధకర్త, బహుగ్రంధ అనువాదకుడు, నటనాధురీణుడు, వక్తృత్వ నిష్ణాతుడు.

10. విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)

ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో అన్ని ప్రక్రియలలోను సేద్యం చేసి నేలను, పంటను కూడా పరిపుష్టం చేసిన ఈ జ్ఞాన పీఠాధిపతి అక్షరాలా కవి సామ్రాట్. అభిమాన వర్గం, శిష్య వర్గం వీరికి ఉన్నంతగా, మరి ఎవరికో గాని ఏర్పడదు. అధ్యయనాన్ని, అభ్యాసాన్ని కూడా నికషోపలం చేసుకున్న బుద్ధిజీవి.

11. త్రిపురనేని రామస్వామి చౌదరి (1886-1943)

ఆధునిక తెలుగు సాహిత్యంలో హేతువాదానికి, మానవతావాదానికి మూలపురుషుడు. సాంఘిక విప్లవానికి భావ విప్లవమే ఆధారభూతమని ఆశయించి ఆ సిద్ధికి గాను సనాతన వాఙ్మయానికి వినూత్న విశ్లేషణ గోచరమయ్యే రచనలు వీరి కలం నుండి వెలువడ్డాయి.

12. నిడుదవోలు వేంకటరావు (1903-1982)

డాక్టరేట్ల కోసం కాక వాఙ్మయ ప్రయోజనం మీది ప్రేమ చేత మానవల్లి, వేటూరి, మల్లంపల్లి వంటి అగ్రపరిశోధక శ్రేణికి చేరినా, అల్పాక్షరాలతో, అనల్పార్దాలతో కవితలున్నూ చెప్పారు. “అసలు" వృత్తి బోధన, సిసలు వృత్తి శోధన, స్పెషలు వృత్తి రచన. చాదస్తం చేరని పాండిత్యం వల్ల జంగమ విజ్ఞాన సర్వస్వంగా మన్ననలందిన బహు గ్రంధ సంతాన కుటుంబి.

13. గుఱ్ఱం జాషువా (1895-1971)

ఆధునికతలోంచి భావుకతకు, సామాజికతకు తననూ తన కవిత్వాన్ని వ్యాపింపజేసుకున్న త్రివిక్రముడు. కవిత్వంలో లోతు, చమత్కారం, ప్రయోజనం ముప్పేటగా కలిసి రావాలనుకున్న సిద్దసంకల్పుడు.

14. వేటూరి ప్రభాకరశాస్త్రి (1888-1950)

తెలుగు కవులపైన, తెలుగు కవిత్వం పైన అపారమైన ప్రేమతో జీవించిన తొలితరపు పరిశోధక కవి. తాళపత్ర గ్రంధాలలో, శాసనాలలో నిక్షిప్తమై ఉండిన అమూల్యమైన ప్రాచీన వాఙ్మయ సంపదను అన్వేషించి, వెలికి తీసి, పరిశీలించి, పరిశోధించిన భాషా శ్రామికుడు. అన్నమయ్య అని ఒక మహనీయుడు ఉండెనని తొలిసారిగా తెలియజేసిన ధన్యజీవి.

15. వేలూరి శివరామశాస్త్రి (1892-1967)

అవధాని, బహుభాషావేత్త, బహుప్రక్రియావ్యవసాయి, అనువాదకుడు, ప్రామాణిక విమర్శకుడు. అన్నిటికి మించి సాహితీ సభా నిర్వాహకుడు. తిరుపతి వేంకట కవులకు ప్రధమశ్రేణి అభిమాన శిష్యుడు, కుడిచేయి.