పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
2

ఈ శతావధానము బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకటసుబ్బరాయ, వేంకట రమణ జంట కవులచే 1910వ సంవత్సరము మే నెల 18వ తేదీన, తెనాలి తాలూకా సంగంజాగర్లమూడి గ్రామములో, గ్రామ కచేరి హాలునందొనర్పఁ బడినది. తదాది యముద్రితముగానున్న దీనిని బండిత వర్యులు, దానశీలురగు శ్రీ కోగంటి దుర్గామల్లికార్జునరావు చౌదరిగారి యౌదార్యమున వెల్గునకు గొని రాఁబడినది. నేనా శతావధాన సభలో నొక పృచ్ఛకుఁడను. దీనిని మా గ్రామములోఁ బెద్దలు, మా తండ్రిగారగు శ్రీ కొత్త శివలింగయ్యగారు, రామస్వామిగారు, సంగయ్యగారు (గ్రామ మునసబు) గోపాలకృష్ణయ్యగారు, వీరభద్రయ్యగారు, కొల్లి వేంకట సుబ్బయ్యగారు మున్నగు వారు చేయించి, దాతల యొద్ద వసూలు చేసిన సొమ్మును గవులకు నొసంగి సన్మానించిరి.

ఆ కవుల యనర్గళమయిన యాశుధార యందఱిని విశేషముగా నాకర్షించెను. వారా కాలములో జగమెఱిగిన శతావధానులు. మా యన్నగారగు కొత్త సంగయ్యగారు ప్రశ్నములను సిద్ధపఱచిరి. వ్రాఁత ప్రతిలోఁ బోయిన యొకటి రెండు పదములు నేను బూరించితిని.

ఈ గ్రంథమును ముద్రింపించిన నా మిత్రులు శ్రీ కోగంటి దుర్గా మల్లికార్జునరావు గారికిఁ గృతజ్ఞతా పూర్వక నమోవాకములు - భాషా సేవయే పరమావధిగా నెంచి యిట్టి వానిని వారు ప్రచురించి ధన్యులగుచున్నారు.

సంగంజాగర్లమూడి,

20-10-1969

సౌమ్య విజయదశమి

ఇట్లు,

విమర్శకాగ్రేసర

కొత్త భావయ్య చౌదరి