పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
329

శ్రీరాజా మంత్రిప్రెగడ భుజంగరావు బహద్దర్ జమీందారుగారు 1916లో రచించి ప్రచురించిన హైమవతీ పరిణయము అను నామాంతరము గల "ఆధునిక కవి జీవితములు" - (పుట 31,32) అనుగ్రంధమునందు వ్రాసిన కొప్పరపు కవిసోదరుల వివరములు -


కొప్పరపు కవిసోదరులు

వీరి నివాసస్థలము గుంటూరు జిల్లా నరసారావుపేట తాలూకా కొప్పరము గ్రామము. ఆశుకవిచక్రవర్తులు. శతావధానులు. తండ్రి కొప్పరపు వేంకటరాయఁడుగారు. తల్లి సుబ్బమాంబగారు. ఆఱువేల నియోగిబ్రాహ్మణులు. ఆపస్తంబ సూత్రులు. కౌండిన్యసగోత్రులు. జన్మదివసములు. 1. పార్ధివ సంవత్సర కార్తీక శుద్ద ౭ గురువారము. 2. సర్వజిత్సంవత్సరపుష్య బ౧ శుక్రవారము. వీరి గురువులు 1. బ్రహ్మశ్రీ పోతరాజు రామకవిగారు, 2. బ్రహ్మశ్రీ రామడుగు రామకృష్ణ శాస్త్రిగారు. వీరు అష్టావధాన శతావధానాశుకవిత్వ సభలిప్పటికి దాదాపు 150 కన్న నెక్కుడుగ జరిగించి, అచ్చటచ్చట నర్హులచే బిరుదమండనములఁ బెక్కువడసిరి. 1. అలవాల లష్కరులో బ్రహ్మశ్రీ ఆదిరాజు తిరుమలరావుగారి మహాసభలో "ముంగాలి బిరుదుఅందె"యును 2. మణికొండ ఆస్థానమున మ.రా.శ్రీ తాటిరెడ్డి గోపాలరెడ్డి జమీందారువారిచే 'బాలసరస్వతి' బిరుదమును, 3. నెల్లూరులో మహాసభాజనులచే 'ఆశుకవీంద్ర సింహ' బిరుదమును, 4. బుచ్చిరెడ్డి పాలెములో మ. బెజవాడ పట్టాభిరామరెడ్డిగారిచే 'విజయఘంటికా' బిరుదమును, 5. మదరాసు మహాజనసభలో విజ్ఞాన చంద్రికామండలి వారిచే 'ఆశుకవి చక్రవర్తి' బిరుదమును,