పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

అమ్మాట విని యొక్క కొమ్మయై వచ్చి కా
          వేరీ మహానది వేడ్కఁ బెంచె
అద్దాని విని యొక్క ముద్దరాలై వచ్చి
           నర్మదా నది చాలఁగూర్మి నెఱపె

మఱియు ధాత్రీస్థలంబున మహిమఁగనిన
వాహినీమణు లంచితోత్సాహ మొదవ
నమ్మహోదంతమును వినినంతఁ గాంత
లగుచు వేవచ్చి సేవించి రల్ల గంగ.

బ్రహ్మను చూడ వచ్చిన గంగను సరస్వతి గౌరవించినట్లే క్రిందివిధమున నెంతయు సరసముగఁ గల్పించి చెప్పెరి.

అన్నగారిఁజూడ నన్నుమిన్నగ వచ్చు
గంగఁ దోడి తెచ్చి గారవించె
జగతి మగని లోన సగమాడు బిడ్డయన్
పలుకెఱింగి యుంటఁ బలుకు వెలఁది.

బ్రహ్మ కొలువులోనున్న మహాభిషుఁడను ముని గంగను చూచి మోహించిన విధమిట్లు చెప్పఁబడెను:-

అప్పువ్వువింటి బంటున
కప్పన మొనరించి యమ్మహాభిషు నాత్మన్
ముప్పుం దిప్పలఁ బెట్టెను
ముప్పోకల మారి గంగ ముని యతఁడైనన్.

ఈ సమయమునందు సభ యందలి బల్లమీఁది దీపము వీవన గాలిచే నారిపోఁగా దాని నుపమానముగఁజేసి చక్కని యీ క్రింది పద్యమును జెప్పిరి.