పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

ఇఁక నీ విషయము నింతటితో ముగించి వారి యాశుకవిత్వ, మాశువును గూర్చి యప్పకవి చెప్పినట్లుపమానములు నుత్ప్రేక్షలు లేనిదిగా నుండునో - మన యసత్యవాదులు చెప్పునట్లు గణయతిప్రాసలు లేనిదిగా నుండునో, - లేక మేముచెప్పినట్లు సలక్షణముగానే యుండునో మాపాఠకులకు విశదపరచుటకై మేము వ్రాసికొనిన వారి పద్యములు కొన్నిటి నీదిగువ నుదాహరించెదము -

గంజామువారి యింటఁ జెప్పిన సీతాకళ్యాణమునందలి పద్యములు. దశరథుని పుత్రోదయ మిట్లు వర్ణింపఁబడెను:

దంతములు నాలుగైరావతంబునకును
దనయులగు వారు నల్వురు దశరధునకు
నభ్యుదయ మంద విబుధ చయంబు పొంగ
వైరి దోషాచరాళి గర్వంబడంగ

వసిష్ఠుడు దశరథునితో విశ్వామిత్రుని ప్రభావమునుగూర్చి చెప్పిన మాటలిట్లభివర్ణింపఁబడెను:

చటుల తపోగ్నిచే జగమెల్ల నుడికించి
          భవ్యమౌ బ్రహ్మర్షి పదవిఁ గాంచె
మేనకాంగనతోడ మేనొక్కటిగఁ జేసి
          వలనొప్పఁగా శకుంతలను గాంచె
స్వర్గంబునకుఁ బ్రతి స్వర్గంబు నిర్మించి
          యటఁ ద్రిశంకు మహేంద్రు నటులుంచె
గారాని దొసఁగులఁగావించి దయనించి
          యల హరిశ్చంద్రుని ఖ్యాతుఁ జేసె

బ్రహ్మఁ దిమ్మని, దిమ్మని బమ్మగాఁగ
సేయ నేర్పుగలాఁడు కౌశికుఁ డితండు
చండకోపుఁడు సకలాస్త్ర శస్త్రవేది
వీనికోరికఁ దీర్పు ముర్వీకళత్ర!