పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
291

అను నిట్టి యవధానపుఁ బద్దెములవలన భాషకేమి పోషణము జరుగు చున్నదో! తరచిన కొలఁది యీవిధముగ వారి యుక్తులు వారికి ప్రతి బంధకములైవారి దుర్వాదమును, వారి యోర్వలేమిని, వారి కడుపుమంటను వేనోళ్ల వెల్లడించు చున్నవి.

నిశ్శంకమైన పాండిత్యమును, నిరాఘాటమైన కవితాధారయు, నిర్ధారితమైన ప్రతిభయు, నిష్పన్నమైన కీర్తియు, నిష్కళంకమైన వర్తనమును గలిగి - యాంధ్రలోకమునకెల్ల వన్నెదెచ్చు నీ సోదర కవిచంద్రుల సామర్థ్యమును జూచి సంతసించుటకు మాఱుగా, నీర్ష్యవహించుటయు వారి సభలకుఁ బోకయే, వారి కవితాధోరణి వినకయె, వారెట్టివారో గూడ నెరుఁగకయె తోఁచినట్లెల్ల వదరుటయు నీచకృత్యములుగదా!

ఆశుకవిచక్రవర్తులు ప్రతిసభయందును - ప్రసిద్ధ కథయొసఁగక, యే యితర భాషలలోనిదైనఁ గ్రొత్త కథనొసఁగి మా సామర్ధ్యమును బరీక్షింపుఁడని సభ్యుల ఢీకొని యడుగుచున్నారు. మీకిష్టమగు వర్ణనములను, నియమములను గోరుఁడని గొంతెత్తి పలుకుచున్నారు. మీకేమేని సందియములున్నచోఁ జాటున ద్రోహపుమాటలాడక, సభలోలేచి నిలువంబడి నిస్సంశయముగ మమ్ములనడుగుఁ డని ఢంకాపయి దెబ్బఁగొట్టి చెప్పుచున్నారు. యతిప్రాసము లెంతమందునకైన బోధపడునట్లుగా నాయాస్థలములలో నాఁగియే నుడువుచున్నారు. వ్యంగ్యములు, శ్లేషలు, నౌచిత్యములు మున్నగు విశేషములుండు పట్టులను ప్రతివారికి బోధపడుటకై రెండేసి మూఁడేసిసారులు పఠించుచున్నారు. ఇట్టి స్థితిలో వారిసభకేపోకయుఁ, బోయినఁబెదవి మెదల్పకయు, వెనుక వాదులాడుట తగునా!


“ఇరువురు గూడి యొనర్చునెడం బనులెప్పగిదిన్నెఱవేఱెడునో,
 యిరువురు కాంతల సందునఁ గాంతుఁడదెంత సుఖంపడఁజాలునొ, యొ
 క్కరునకు నొక్కరుఁడేగతిఁ దోడ్పడఁ గావలెనో క్రియలందునఁ గ
 త్తెర మన కత్తెరఁగెల్ల వివేకనిధీ! తగబోధ యొనర్చుంజుమీ!”